శ్రీలంకతో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌లో పాల్గొనేందుకు టీం ఇండియా ఇప్పటికే శ్రీలంక చేరుకుంది. ఆగస్టు 15 నుంచి ఆతిథ్య జట్టు, భారత్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అంతకు ముందు శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లకు కోచ్ గౌతమ్ గంభీర్ పలు కీలక సూచనలు చేశారు.

‘‘మన ముందు ఏ లక్ష్యం ఉందో మనకు తెలుసు. ఎందుకోసం ఆడుతున్నామో తెలుసు. పరిమితులను అధిగమించగలం. ఏదైనా సాధించగలం. అన్ని విభాగాల్లోనూ సత్తా చూపించగలం. బ్యాటింగ్, బౌలింగ్ ఏదైనా సరే.. ఆగస్టు 15 ఉదయం నుంచి మనకు ఎదురయ్యే ప్రతి సవాలుకు జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. ఇప్పటి నుంచే అందుకోసం సన్నద్దమవుదాం.

ఇప్పుడు మనతోపాటు ఇద్దరు కొత్త ప్లేయర్లు ఉన్నారు. వారిద్దరికి శుభాకాంక్షలు. సుర్యాంశ్ ఇక్కడి వరకు వచ్చేందుకు చాలా కష్టపడ్డావు. ఎప్పుడు అవకాశం వచ్చినా దేశం, కుటుంబం గర్వపడేలా చేస్తావని ఆశిస్తున్నా. ఇక అకిబ్ సబీకి స్వాగతం. గత సీజన్‌లో అదరగొట్టావు. జమ్ముకశ్మీర్ జట్టు రంజీ ట్రోఫీ నెగ్గడంలో కీలక పాత్ర పోషించావు. ఇక, మనతో పాటు పని చేసేందుకు శుభదీప్ ఘోష్ (ఫీల్డింగ్ కోచ్) వచ్చారు. చాలా జట్లతో గత కొన్నేళ్లుగా ఆయన పని చేశారు. ఆయన నిబద్ధత, ఎనర్జీ లెవల్స్ అద్భుతం. తన ప్రతిభతో మనందరిని లక్ష్యం దిశగా తీసుకెళ్తారని ఆశిస్తున్నా’’ అని గంభీర్ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని బిసిసిఐ సోషల్‌మీడియాలో షేర్ చేసింది.