కనుపాపల్లో స్నేహ జలాలు కమ్ముకోవాలి

వెన్నెల జలంతో కడుక్కున్న ముఖంలో

పెదవుల పైన పూలు పూచే తీగలు అల్లుకోవాలి

చేతులు రెండూ సముద్రమంత విశాలంగా

ఛాతీని ఆకాశంలో పరిచి ఆహ్వానించాలి

స్కూల్ పిల్లలు ఆడుకునే ఆట మైదానంలా

ఎదుట పక్షం గాయపడకుండా పచ్చికై పర్చుకోవాలి

ఎంతైనా మానవమాత్రులం ఎంగిలాకులం

ఎండమావుల వెనక పరుగెత్తి, పరుగెత్తి

సంతలనం కోల్పోయిన వాళ్ళం

పోగేసిన వంచనల ఆటలో మోసపోయి

స్వార్థ సంకుచిత వ్యదార్థ వృధా కేళీలో వోడిపోయినా

వీడని ఆశ నిరాశల క్రీనీడలో నిల్చున్నవాళ్ళని

ఏ పరిశ్వంగం లాంటి సజీవ కరణి ప్రయోగమే చేయాలి

మనిషిని చేయించే పుష్పకృపాణం కదా చిరునవ్వు

నమ్మకాలెండిన ఊట బావి మోట వద్ద ఒంటరిగా నిలుచున్నప్పుడు

ఒక చిన్న ప్రహారం చాలు మనిషిని చేయించడానికి

విశ్వ మానవ సామ్రాజ్య చక్రవర్తిగా నిలబెట్టడానికి

ఆలోచన లేకుండా ఏ పని చేయలేనప్పుడు

అనాలోచితంగా హృదయ ద్వారాలు తెరుచుకొని

వేణుగాన లాహిరి ఏదో లోలోపలి ప్రవేశిస్తున్నప్పుడు

సిరి సిరిసిరి మువ్వల గువ్వల చప్పుళ్లతో

సుతిమెత్తని ఊపిరి అడుగులేవో గుండెని స్పృశిస్తున్నప్పుడు

శాద్వలాలనాడించే లేలేత చిరుగాలి లాంటి చిరునవ్వు కృపాణంతో

పాషాణ ద్వేషాన్ని వజ్ర కాంతిలా సంహరించాలి

మనసుకు మనసుకు మధ్య మమతల రహదారి కోసం నిరీక్షిస్తున్న

ప్రతిహారిని ఆత్మ సంగమంతో కౌగిలించుకోవాలి

- ఈతకోట సుబ్బారావు

9440529785