
బొద్దింకల పార్టీ (కాక్రోచ్ జనతా) ఢిల్లీ పెద్దల మొద్దు నిద్ర వదిలించింది. పోలీసులు బారికేడ్లను అడ్డుగా ఉంచినా, లాఠీలు స్వైర విహారం చేసినా, బాష్పవాయువు కమ్ముకొచ్చినా ఏమాత్రం లెక్కచేయక, బెదరక ఆందోళనకారులు పార్లమెంట్ భవనం వైపు కదం తొక్కారు. పార్లమెంట్ రోడ్డంతా రణరంగాన్ని మరిపించింది. ఢిల్లీ నగరం గడగడలాడింది. ఢిల్లీ రైల్వే మెట్రో కార్పొరేషన్ ఐదుస్టేషన్లను మూసివేసింది. ఇంటర్నెట్ సర్వీసులు రద్దయ్యాయి. నీట్ యుజి పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యావ్యవస్థలో ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్లు చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) సోమవారం పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజున జంతర్ మంతర్ నుంచి చేపట్టిన ర్యాలీ ఉప్పెనలా ముందుకు సాగింది. భద్రతా దళాలు ఈ ఉప్పెనను అడ్డుకోలేకపోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరికాక తప్పలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒకవైపు పార్లమెంట్ భవనం లోనే భేటీ కాగా, మరోవైపు చలో పార్లమెంట్‌కు నాయకత్వం వహిస్తున్న నాయకులతో కేంద్ర మంత్రి జెపి నడ్డా చర్చలు జరిపారు.
ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతున్న వాంగ్‌చుక్‌ను వెంటనే ఆస్పత్రి నుంచి విడుదల చేయాలని, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పేపర్ లీక్‌లకు బాధ్యత వహించేలా పదవి నుంచి తొలగించాలని, పరీక్షల అస్తవ్యస్తం వల్ల ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ. ఒక కోటి వంతున నష్టపరిహారం అందించాలన్న మూడు డిమాండ్లను ఆందోళనకారులు మంత్రి జెపి నడ్డాకు సమర్పించారు. ఈ డిమాండ్లు సత్వరం అమలు చేయకుంటే నిరసనలు కొనసాగిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని నడ్డా హామీ ఇచ్చారని సిజెపి ప్రతినిధులు వెల్లడించారు. మరోవైపు జంతర్‌మంతర్ వద్ద ఉద్విగ్న పరిస్థితులు కనిపించాయి. సిజెపి వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరాహార దీక్ష విరమించారు. 23 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఐసా విద్యార్థి నాయకులు తమ దీక్షలు ముగించారు. నిరాహార దీక్షలు ముగిసినా సిజెపి పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. దీక్ష విరమించేందుకు పర్యావరణ ఉద్యమనేత వాంగ్‌చుక్ కూడా సిద్ధమయ్యారు.
ఈ మేరకు మూడు షరతులతో ఆస్పత్రి నుంచి లేఖ విడుదల చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలకు విపక్షాల మద్దతు భారీగా లభించింది. ఒకవైపు రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థులపై లాఠీ చార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. యువత వ్యతిరేకి అంటూ ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. మోడీ ప్రభుత్వ హయాంలో మొత్తం 152 పరీక్ష పేపర్లు లీకయ్యాయని, దీనివల్ల 7.5 కోట్ల మంది బాధితులయ్యారని ఆయన ఉదహరించారు. కేరళ ఎంపిలు కూడా ఈ నిరసనలకు మద్దతు పలికారు. మొత్తం మీద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు వేలాది మంది విద్యార్థులు సంఘీభావం ప్రకటిస్తూ కదంతొక్కడం కేంద్రం గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. మొదటి నుంచీ కాక్రోచ్ పార్టీని పురుగుల్లా కేంద్రం చూస్తోంది. ఈ పార్టీ పెట్టిన రెండు రోజులకే సిజెపి సోషల్ మీడియాకు రెండు కోట్ల మంది ఫాలోయర్లు చేరినా తక్కువ అంచనా వేసింది. వీరు వైరస్ లాంటివారని, తుక్డేతుక్డే గ్యాంగ్ అని వీరి వెనుక విదేశీశక్తులు ఉన్నాయని అనేక అవహేళనలు చేస్తూ ఉద్యమాన్ని నీరుకార్చే ప్రయత్నాలు చేసింది.
అలాగే పర్యావరణ ఉద్యమనేత వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షపట్ల కన్నెత్తి చూడలేదు. ఆయన 10 కిలోల బరువు తగ్గి బాగా నీరసించిన తరువాత ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై ఆస్పత్రిలో బలవంతంగా చేర్పించింది. వామపక్ష నేతలు, టిఎంసి, ఆర్‌జెడి, ఎస్‌పి నేతలతోపాటు ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఈ నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. కొందరు జంతర్‌మంతర్ వద్దకు వెళ్లి ఆయన దీక్షా శిబిరం వద్ద ఆయనను కలుసుకుని పరామర్శించారు. ఇదంతా ప్రధాని మోడీ ప్రభుత్వం మొండితనమే కాదు, ఉద్యమాన్ని ఉక్కుపాదంతో తొక్కివేయాలన్న ప్రయత్నమే. దేశంలో సంచలనం కలిగించిన నీట్‌పేపర్ లీకేజీపై తీవ్రంగా స్పందించిన కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్బావమే అవహేళనల మధ్య పుట్టిందన్న సంగతి తెలిసిందే. డిజిటల్ వేదికగా యువత కాక్రోచ్ జనతా పార్టీ, జాతీయ పరాన్నజీవుల కూటమి (నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్)పేర్లతో రెండు బలమైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, వ్యవస్థాగత అవినీతికి నిరసగా భారతీయ జెన్‌జెడ్ సోషల్ మీడియా వినియోగదారులు ఈ ఆన్‌లైన్ రాజకీయ ఉద్యమాలను చేపట్టారు. యువత ఆక్రోశాన్ని ప్రతిబింబించే సామూహిక డిజిటల్ నిరసనగా ఇవి రూపాంతరం చెందాయి.
ఇందులో కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటైన కేవలం 48 గంటల్లోనే ఆ పార్టీ ఎక్స్ ఖాతాలో 60 లక్షల వరకు ఫాలోవర్లు పెరిగారంటే వీరి ఉద్యమం ఎంత బలంగా ఉందో తెలుస్తుంది. కేవలం పేపర్ లీకేజీలే కాదు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు రిటైరైన తరువాత వారికి ప్రభుత్వం పదవులు కట్టబెట్టరాదని, ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు చేయాలని, చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేయాలని, అక్రమ మీడియా సంస్థల లైసెన్సు రద్దు చేయాలన్నవి కాక్రోచ్ జనతాపార్టీ ప్రధాన డిమాండ్లు. ఈ డిమాండ్లు మోడీ ప్రభుత్వానికి అమలు చేయడమంటే గొంతుకలో వెలగపండు పడినట్టే. ఫిరాయింపులను ప్రోత్సహించడంలో మోడీ, అమిత్ షాలు అగ్రస్థానంలో ఉంటారు. ప్రధాన న్యాయమూర్తులకు పదవులు కట్టబెట్టడం కూడా వారికి అలవాటే. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ శక్తి సామర్థాలు ఏ మేరకు ఉపయోగపడతాయో పరిశీలించాల్సిందే.











