మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన రస్టిక్ స్పోర్ట్ డ్రామా ‘పెద్ది’తో బాక్సాఫీస్ తుఫాన్ సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో చరణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నిర్మాత వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ‘పెద్ది’ని భారతీయ సినిమాకు కొత్త అనుభూతిని ఇచ్చే విజువల్ వండర్‌గా రూపొందించారు. ఇప్పుడు ఆ ఆసక్తిని మరింత పెంచుతూ ముంబై, భోపాల్ నగరాల్లో రెండు భారీ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న ముంబైలో గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు.

ఈ ఈవెంట్ ద్వారా సినిమా భారీ కాన్వాస్‌ను జాతీయ మీడియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ముంబై ట్రైలర్ లాంచ్ తర్వాత, చిత్ర బృందం ఈ కథ మూలాలను సెలబ్రేట్ చేయడానికి హార్ట్ అఫ్ ఇండియా గా పిలిచే భోపాల్‌కు వెళ్లనుంది. మే 23న అక్కడ స్పెషల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌ను మరింత ప్రత్యేకంగా మార్చేలా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వయంగా ‘పెద్ది’ పాటలను లైవ్‌లో పర్ఫార్మ్ చేయనున్నారు. అలాగే సౌండ్ ఆఫ్ పెద్దిని లాంచ్ చేయనున్నారు.

రెహమాన్‌తో పాటు పలువురు ప్రముఖ గాయకులు వేదికపై లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’, ‘రైరై రారా’ పాటలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, జూన్ 3న ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి.