కోల్‌కతా: ఐపిఎల్ 2026లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈడెన్ గార్డెన్స్‌లో ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగు వికెట్ల తేడాతో సాధించిన విజయం సాధించింది. దీంతో ఈ సీజన్ లో అత్యధికంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచి నయా రికార్డు నెలకొల్పాయి. ఇప్పటివరకు జరిగిన 65 మ్యాచ్‌లలో, రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు 42 విజయాలను నమోదు చేసి, ఒకే ఐపీఎల్ ఎడిషన్‌లో కొత్త రికార్డును నెలకొల్పాయి. దీంతో అంతకుముందు, ఐపీఎల్ 2016లో నమోదైన 41 విజయాల రికార్డు బ్రేక్ అయ్యింది. ఈ మెగా టోర్నీలో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు 40 విజయాల మార్కును దాటిన సీజన్లు కేవలం రెండే ఉన్నాయి. ఆ జాబితాలో ఐపీఎల్ 2011 (40 విజయాలు), ఐపీఎల్ 2016 (41 విజయాలు) ఉన్నాయి.

కాగా, మ్యాచ్ విషయానికి వస్తే.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా మే 20న జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ముంబై.. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. చివర్లలో బాష్(18 బంతుల్లో 32 పరుగులు) ధనాధన్ షాట్లతో చెలరేగాడు. దీంతో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కెకెఆర్ 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ముంబై జట్టుకు 4 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. కాగా, ముంబై జట్టు ఇప్పటికే టోర్నమెంట్ నుండి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో కెకెఆర్, ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా నిలుపుకుంది.