
కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో 1956 జనవరి 12 న పుట్టారు. చిత్రకారుడిగా, ఫోటో గ్రాఫర్‌గా వృత్తి జీవితాన్ని కొనసాగిస్తూనే, కవిగా ఎదిగాడు. 1982 లో హైదరాబాదులో స్థిరపడ్డాడు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళ పాటు సీరియల్‌గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై మినీ కవిత్వం రాశాడు. తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచనా దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన అతి కొద్ది మంది కవుల్లో అలిశెట్టి ఒకడు. 1993 జనవరి 12న అనారోగ్యంతో అలిశెట్టి ప్రభాకర్ మరణించాడు. ఎర్ర పావురాలు (1978), మంటల జెండాలు (1979), చురకలు (1981), రక్త రేఖ (1985) ఎన్నికల ఎండమావి (1989), సంక్షోభగీతం (1990), సిటీ లైఫ్ (1992), మరణం నా చివరి చరణం కాదు కవిత సంకనాలను అలిసెట్టి ప్రభాకర్ రాసాడు. క్లుప్తంగా లోతైన,పదునైన కవిత్వం రాసిన ప్రభాకర్ కవిత్వం ఎందరినో ప్రభావితం చేసింది.
ఏ కాలంలోనైనా సమాజంలోని రుగ్మతలను వ్యంగ్యంగా కవిత్వీకరించడం కవులకున్న అసాధారణ లక్షణం. ఆ లక్షణమే పాఠకులను ఆలోచింపజేసి, వారిని చైతన్యపథంలో నడిపిస్తుంది. సమాజం పట్ల బాధ్యతతో కవిత్వాన్ని ఆయుధంగా మలచుకున్న వారిలో అలిశెట్టి ప్రభాకర్ అగ్రశ్రేణిలో ఉంటారని చెప్పడం అతిశయోక్తి కాదు. నిజానికి, తెలుగు వచన కవిత్వంలో అలిశెట్టిది ఒక విలక్షణమైన సంతకం. ఆయన కవిత్వం సామాజిక రోగాలకు నిర్మొహమాటంగా శస్త్రచికిత్స చేసే పదునైన ఆయుధం.
అలిశెట్టి అక్షరం ఎప్పుడూ ముసుగులు వేసుకోదు. ఉన్నది ఉన్నట్లుగా, సూటిగా గుండెల్లోకి దిగేలా చెప్పడమే ఆయన శైలి. 1978లో వెలువడిన ‘ఎర్ర పావురాలు’ సంకలనంలోని ‘నిర్మొహమాటం’ అనే కవితను గమనిస్తే, సమాజం పట్ల ఆయనకు గల బాధ్యత ఎంతో అర్థమవుతుంది. ఆ కవిత నేటికీ పాతబడని ఒక పదునైన వ్యంగ్యాస్త్రంగా నిలిచి ఉండటం విశేషం. వ్యవస్థలోని వైరుధ్యాలను నిలదీస్తూ ఆయన ఇలా అంటారు.
‘దేవుళ్ళు తమ గుళ్ళకి రాత్రిళ్ళంతా
తాళాలు వేసుకుంటున్నారెందుకో
బహుశా మనుషుల మీద నమ్మకం పోయిందేమో!
ప్రజా నాయకులు తమని గెలిపించిన ఓట్లనే
ఇంకా లెక్కపెట్టుకుంటూ మురిసిపోతున్నారేమో
ప్రజాసేవకి అప్పుడే ఏమంత తొందరొచ్చిందని కాబోలు!
ఇప్పుడే ఏం కొంప మునిగిందని యువతరం పైకి రావటానికి
వార్థక్యం దాకా బోలెడు టైముందిగా..
పాపం అందుకే బుడిబుడి అడుగేస్తున్నారింకా!
ఈ ఒక్క చిన్న కవితలో దైవంపై నమ్మకం సడలడం దగ్గరి నుండి, నాయకుల నిర్లక్ష్యం వరకు, చివరకు యువతలోని స్తబ్దత వరకు ఆయన దేన్నీ వదిలిపెట్టలేదు. ‘వార్ధక్యం దాకా బోలెడు టైముందిగా’ అంటూ ఆయన విసిరిన చమత్కా రం, యువతలోని బాధ్యతారాహిత్యాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తుంది. కవిత్వంలో నవ్యత అంటే కేవలం పదాల కూర్పు మాత్రమే కాదు, అది కాలానికి ఎదురునిలిచి నిలదీసే ధైర్యం అని అలిశెట్టి నిరూపించారు. సామాజిక స్పృహ కలిగిన నాతో సహా, యువ కవికైనా అలిశెట్టి అక్షరం ఒక దిక్సూచి. అందుకే దశాబ్దాలు గడిచినా ఆ అక్షరాలు నేటికీ కొత్తగానే కనిపిస్తున్నాయి.
- సందీప్ వొటారికారి








