
నేను, నా సాహితీ యాత్ర: 23 నేను పుట్టింది ఒక మారుమూల గ్రామంలో. పేరు సీతారామపురం.చదువుకోవడానికి నేను చాలా పోరాటం చేసాను. ఎలాగోలా డిగ్రీ పూర్తిచేసి 1975లో ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాను. చాలా సంవత్సరాలు చిన్న చితకా ఉద్యోగాలు చేసాక, 1979లో పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లో ఉద్యోగం దొరికింది. మా సీతారంపురం నుండి ఉద్యోగం కోసం హైదరాబాద్ రావడం వెనక ఉన్నది మా నాన్న ప్రోత్సాహం. 1975 సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా దినంగా ప్రకటించడం వల్ల ఆడవాళ్ళకి ఉద్యోగాలొస్తాయని మా నాన్న బలంగా నమ్మి నన్ను తెచ్చి ఈ మహారణ్యంలో పడేసాడు. 1979 వరకూ నాకు ఉద్యోగం దొరకలేదు.అయినా నేను భయపడలేదు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ నిలదొక్కుకున్నాను. అదంతా చాలా పెద్ద కధ.
ఇంటర్మీడియట్ చదివేటప్పటికే నేను నాస్తికురాలను. నాస్తికుడు దొరకకపోతే పెళ్ళేచేసుకోవద్దని అనుకున్నాను. అయితే 1980 లో విజయవాడలోని గోరా గారి నాస్తిక కేంద్రంలో గమ్మత్తుగా ఓ నాస్తికుడు పరిచయమయ్యాడు. మాయలు, మంత్రాలు లేవం టూ నిప్పుల గుండం తొక్కినప్పుడు, తూలి పడబోతున్నప్పుడు ఓ చెయ్యి, నా చేయి పట్టుకుని పడిపోకుండా ఆపింది. అతనే సంవత్సరం తర్వాత నా జీవన సహచరుడయ్యాడు. చిన్న అడ్వకేట్ స్థాయి నుంచి హైకోర్ట్ జడ్జిగా ఎదిగిన జస్టిస్ వివిఎస్ రావ్. మా దండల పెళ్ళి మల్లాది సుబ్బమ్మ, రామ్మూర్తి గారు, లవణం గార్ల ఆధ్వర్యంలో వికాస కేంద్రంలో జరిగింది.
1985వ సంవత్సరం నా జీవితంలో సంక్షోభ సమయం. గుండెల్లో రూపాయకాసంత కన్నం ఉందని గుండె ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్లు చెప్పడంతో ధైర్యంగా గాంధీ హాస్పిటల్‌లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని బతికి బయటపడ్డాను. అదో పెద్ద కథ. చిన్నప్పటినుండి సవాళ్ళను ఎదుర్కోవడమే నేర్చుకున్నాను. నాస్తికురాలిగా నా జీవన విధానంలో ఎప్పుడూ ఎక్కడా రాజీ పడలేదు. ధైర్యం కోల్పోలేదు. నాకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. భారతదేశంలో ఎన్నో ప్రాంతాలు తిరిగాను. ముఖ్యంగా నాకు అడవులంటే ప్రాణం. నల్లమల, మన్యం అడవుల్లోకి ఎన్నోసార్లు ప్రయాణాలు చేసాను. నాకు ఒంటరి ప్రయాణాలు చెయ్యడం చాలా ఇష్టం. ఒంటరిగా అడవుల్లోకి ఎలా వెళతారు, భయం వెయ్యదా అని అడుగుతారు.. కానీ, నాకు అడవులంటే ప్రేమే కానీ భయం లేదు. ఎన్నిసార్లు వెళ్ళినా అడవి ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఎన్నో జీవిత పాఠాలు నేర్పుతుంది.
చదువుకునే రోజుల్లోనే లెక్చరర్ల ప్రోత్సాహం వల్ల పుస్తకాలు చదవడం అలవాటైంది. పుస్తకాలే నా జీవితాన్ని మార్చాయి. నాస్తికురాలయ్యాను. అన్వేషి పరిచయం నా జీవితాన్ని మరో మలుపు తిప్పింది. స్త్రీల ఉద్యమాలు, స్త్రీవాద రాజకీయాలు, ఫెమినిజం, సామాజిక ఆచరణ ఇవన్నీ జీవితంలో భాగమయ్యాయి. నేను పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లో 22 సంవత్సరాలు ఉద్యోగం చేసాను. ఆ తర్వాత మూడేళ్లు తహసీల్దారుగా మా జిల్లాలోనే పనిచేసాను. 2000వ సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఫుల్ టైం భూమికలోనే ఉండిపోయాను. ఎన్‌టిఆ ర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన 53రోజుల సమ్మె సందర్భంగా అరెస్ట్ అయి రాత్రంతా నేరస్థుల మధ్య పోలీస్ కంట్రోల్ రూంలో ఉన్నాను. కన్నభిరాన్ గారు నాకు బెయిల్ ఇప్పించారు. ఇవన్ని గొప్ప జ్ఞాపకాలు.. జీవితానుభవాలు.
భూమికలో పనిచేస్తూనే నేను సామాజిక కార్యకర్తగా మారాను. ఎన్నో ఉద్యమాల్లో ప్రజా సంఘా ల్లో, ఆయా సంస్థలతో కలిసి పనిచేస్తున్నాను. 1989లో లోహిత, 1993లో భూమిక ప త్రిక స్థా పనలో భాగస్వామినయ్యాను. 2000వ సంవత్సరంలో భూమిక పూర్తిగా నా ఆధ్వర్యంలోకి వచ్చిం ది. 32 సంవత్సరాలుగా భూమిక నడుస్తున్నది. 1995లో భూమిక వుమన్స్ కలెక్టివ్ ప్రారంభం, 2006లో భూమిక హెల్ప్‌లైన్, పోలీస్ స్టేషన్లలో బాధిత మహిళల కోసం సపోర్ట్ సెంటర్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం భూమిక దేశవ్యాప్తం స్త్రీల మీద జరిగే హింసకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థగా ప్రాచుర్యం పొందింది. నేను నా తొలి కథ ‘ఊరేగింపు’ పేరుతో 89లో రాసాను. లోహిత స్త్రీవాద పత్రికలో అచ్చు అయ్యింది. ఆ తర్వాత చాలా కథలు రాసాను. మూడు కథల సంపుటాలు వచ్చాయి. 32 సంవత్సరాలలో రాసిన భూమిక సంపాదకీయాలు ‘వాడిపోని మా టలు’ పేరుతో మూడు సంకలనాలుగా వచ్చాయి. నాకు చాలా సంతృప్తిని ఇచ్చిన నా రచన భండారు అచ్చమాంబ సచ్చరిత్ర పుస్తకం. నేను చేసిన ప్రయాణానుభవాల పుస్తకం ‘తుపాకీ మొనపై వెన్నెల’.
అవార్డులు చాలానే వచ్చాయి. మీడియాలో జెండర్ సెన్సిటివిటీ అనే అంశం మీద లాడ్లీ మీడియా అవార్డు దక్షిణ ప్రాంతానికి, జాతీయ స్థాయికి రావడం సంతోషాన్నిచ్చింది. అలాగే రంగవల్లి స్మారక అవార్డు రావడం నా పని మీద, నా రాత మీద నాకు గొప్ప సంతృప్తిని కలిగించింది. 1980లో స్త్రీవాద ఉద్యమం, 1990లో ప్రపంచీకరణ విధ్వంసం ఈ రెండు నా రచనల్లో ప్రతిబింబించాయని నేను భావిస్తాను. ఉస్మానియా యూనివర్సిటి నుంచి రేణుక అనే స్కాలర్ నా జీవితం,రచనల మీద పి హెచ్ డీ చేసి డాక్టరేట్ పట్టా తీసుకుంది. నాకు కథలు రాయడం ఇష్టం. కానీ నా ఏక్టివిజం పెరగడం వల్ల ఈ మధ్య కథలు రాయడం లేదు. ప్రస్తుతం ఎంతోమంది యువత రచనల వేపు రావడం సమాజానికి అవసరమైన రచనలు చేయడం నాకు సంతోషంగా అనిపిస్తుంది. అస్తిత్వవాద స్పృహతో వస్తున్న రచనలు చదివినప్పుడు ఆయా జీవితాల్లోని సంఘర్షణ, దుఃఖం మనసును మెలిపెడతాయి. నాకు తెలియని ఆ జీవితాలు చాలా సార్లు నన్ను నిర్ఘాంతపరుస్తాయి. ఇలాంటి రచనలు ఇంకా ఇంకారావాలనిపిస్తుంది. మన చుట్టూ కథాంశాలకు లోటు లేదు. అవన్నీ కథలుగా, కవిత్వాలుగా బయటకు రావాలి. అన్ని రకాలుగా సంక్షోభంలో ఉన్న ఈ నాటి సామాజిక పరిస్థితుల మీద విరివిగా రచనలు రావాలని నేను అనుకుంటున్నాను.

- కొండవీటి సత్యవతి











