
బిటెక్ చదువుతున్న విద్యార్థులు, గ్రాడ్యుయేట్ అయి బయటికి వచ్చిన విద్యార్థులు ఇటు డేటా సెంటర్లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అద్భుతమైన కెరీర్ సాధించాలనుకుంటే, కేవలం కాలేజీ సిలబస్ మాత్రమే సరిపోదు. ప్రస్తుతం ఇండస్ట్రీ ఆశిస్తున్న నైపుణ్యాలు, ప్రాజెక్ట్‌లు, అదనపు అర్హతలు నేర్చుకోవాలి. కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీరికి ఎంతో అవసరం. ఎఐ ప్రపంచంలో అడుగుపెట్టడానికి బలమైన కోడింగ్ పునాది అవసరం. ఎఐ/ఎంఎల్ రంగానికి పైథాన్ అత్యంత కీలకం. NumPy, Pandas, Scikit-learn వంటి వాటిపై పట్టుసాధించాలి. వీటితో పాటు R/Java/C++ కోర్పుల ద్వారా డేటా అనలిటిక్స్ లేదా సిస్టమ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ కోసం ఇవి ఉపయోగపడతాయి. ఎఐ అనేది కేవలం కోడింగ్ కాదు, దాని వెనుక బలమైన మ్యాథమెటిక్స్ ఉంటుంది. కింది అంశాలపై కనీస అవగాహన తప్పనిసరి. Linear Algebra&Calculus లాంటివి మ్యాట్రిక్స్ ఆపరేషన్స్, గ్రేడియంట్ డిసెంట్ వంటివి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.
డేటాను విశ్లేషించడానికి, మోడల్స్ ప్రిడిక్ట్ చేయడానికి Probability & Statistics లాంటివి అవసరం. ప్రైమరీ ఎఐ/ఎంఎల్ కాన్సెపట్స్ అవసరం. Machine Learning (ML)లో రాణించాలంటే సూపర్‌వైజ్డ్, అన్‌సూపర్‌వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్స్ నేర్చుకోవాలి. Deep Learning (డిఎల్) ద్వారా న్యూరల్ నెట్‌వర్క్ సిఎన్‌ఎన్, ఆర్‌ఎన్‌ఎన్ వంటి అడ్వాన్స్‌డ్ కాన్సెపట్స్ మీకు అలవడతాయి. Generative AI& LLMs ద్వారా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ CHAT GPT, Gemini వంటివి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవచ్చు. మీ రెజ్యూమే వెయిటేజ్ పెరగడానికి గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఎంతగానో తోడ్పడతాయి.గూగుల్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ లేదా ఐబిఎం అందించే ఎఐ/ఎంఎల్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ ఎంతోఅవసరం. AWS Certified Machine Lear ning, Google Cloud Professional Machine Learning Engineer, లేదా Microsoft Certified Azure AI Fundamentals క్లౌడ్ కోర్సెస్ చేయాలి. మీరు క్లాస్‌లో కూర్చుని చదువుకున్న థియరీ కంటే మీరు ఏం చేయగలరో చూపించే ప్రాజెక్ట్ ఎంతో ముఖ్యం. క్యాగిల్ (Kaggle ప్లాట్‌ఫారమ్‌లో డేటా సైన్స్ పోటీల్లో పాల్గొని ర్యాంక్ సాధించాలి. మీరు గతంలో చేసిన ప్రాజెక్ట్ అంటే.. చాట్‌బాట్స్, ఇమేజ్ రికగ్నిషన్ సిస్టమ్స్, ప్రిడిక్టివ్ మోడల్స్ కోడ్‌ను గిట్‌హబ్‌లో మెయింటైన్ చేయాలి. వీలైతే ఓపెన్ సోర్స్ ఎఐ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావాలి. TensorFlow లేదా PyTorch వంటి డీప్ లెర్నింగ్ ఫ్రేమ్‌వర్క్‌లో కనీసం ఒకదానిపై పూర్తి పట్టు ఉండాలి. Data Visualizationలో కీలకమయిన Tableau లేదా PowerBI నేర్చుకోవాలి.
మోడల్స్‌ను డిప్లాయ్ చేయడానికి Docker, Kubernetes, లేదా MLflow వంటి టూల్స్ నేర్చుకుంటే ఇండస్ట్రీలో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. థర్డ్ ఇయర్ లేదా ఫోర్త్ ఇయర్‌లో ఉన్నప్పుడే ఏదైనా స్టార్టప్ లేదా కంపెనీలో ఎఐ/ఎంఎల్ ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల రియల్-టైమ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. క్లిష్టమైన వ్యాపార సమస్యలకు ఎఐ ద్వారా పరిష్కారం ఎలా చూపించాలో ఆలోచించే సామర్థ్యం, మీ ఐడియాను ఇతరులకు వివరించే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. విద్యార్థులు చేసే తప్పు ఒకటుంది. ఒకేసారి అన్నీ నేర్చుకోవాలని కంగారు పడిపోతుంటారు. అలా చేయకుండా మొదట Python, Statistics తో స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ నేర్చుకుని, చిన్న చిన్న ప్రాజెక్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి. భారతదేశంలో డేటా సెంటర్ పరిశ్రమ రోజురోజుకీ అభివృద్ధి చెందుతోంది.ఇది డిజిటల్ ఇండియా, ఎఐ, క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల వచ్చిన పెద్ద మార్పుగా చెప్పవచ్చు. దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటు యుద్ధప్రాతిపదికన సాగుతోంది. డేటా సెంటర్ల నిర్మాణ సమయంలో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వంటి రంగాలకు చెందిన నిపుణులకు, నిర్మాణరంగ కార్మికులకు ఇంచుమించుగా 60 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ట్రాన్స్‌ఫార్మర్లు, స్విచ్‌గేర్‌లు, కూలింగ్ సిస్టమ్‌లు, బిల్డింగ్ మెటీరియల్, యుపిఎస్ లు, జనరేటర్లు వంటి బ్యాకప్ పవర్ సరఫరాదారులు, వర్కర్లకు ఉపాధి లభిస్తుంది. వీటికి అవసరమైన పరికరాలు సరఫరా చేసే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటవుతాయి.
దేశ, విదేశాలకు చెందిన ఐటీ, సాఫ్ట్‌వేర్ నిపుణుల రాకపోకలతో ఎయిర్ కనెక్టివిటీ పెరుగుతుంది. 2030 నాటికి డేటా సెంటర్ సామర్థ్యం 3,400 మెగావాట్లకు పెరగనుంది. ఎఐ వల్ల డిమాండ్ ఇంకా పెరుగుతుంది. టయర్ 2, టయర్ 3 నగరాల్లో కూడా డేటా సెంటర్లు వస్తున్నాయి. Google, Facebook, WhatsApp వంటి యాప్స్ డేటా నిల్వకి ఇవి ఎంతో అవసరం. మనం వాడే డిజిటల్ సేవలకు డేటాసెంటర్లే ఆధారం. coze సెంటర్లకు నిరంతరాయంగా విద్యుత్, నీటి సరఫరా ఎంతో అవసరం. డేటా నిర్వహణ, సర్వర్లు, నెట్‌వర్క్‌పై ఆధారపడిన పనులు ఇక్కడ జరుగుతాయి. డేటా సెంటర్ల వల్ల నెట్‌వర్క్ ఇంజినీర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ ఇంజనీర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ ఇంజనీర్, ఎథికల్ హ్యాకర్, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, ఎఐ/ఎంఎల్ ఇంజనీర్, డేటా సెంటర్ ఆపరేటర్, టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్, నెట్‌వర్క్ ఆపరేషన్స్ సెంటర్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుంది.
భారతదేశంలో ఎక్కువ డేటా సెంటర్లు ముంబైలో, చెన్నై బెంగళూరుల్లో ఉన్నాయి. ఆ తరవాత హైదరాబాద్, యుపిలో ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో భారీగా డేటా సెంటర్లు రాబోతున్నాయి. విశాఖపట్నంలో గూగుల్ భారీ ఐఎ డేటా సెంటర్ హబ్ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ విలువ సుమారు 15 బిలియన్ డాలర్లు. భారతదేశంలో ఇప్పటి మొత్తం సామర్థ్యానికి మించి ఇది ఉండబోతోంది. దీనికి తోడు రిలయన్స్ సంస్థ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో 1,200 మెగావాట్ల ఏఐ ఆధారిత డేటాసెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు రూ.1.60 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. డేటాసెంటర్ ప్రాజెక్ట్‌తో పెద్ద స్థాయి లో ఉద్యోగ విప్లవం రాదు. దీర్ఘకాలిక అభివృద్ధి కోసం మరిన్ని కంపెనీలు రావాలి, నైపుణ్య శిక్షణ పెరగాలి. స్థానిక యువత టెక్నాలజీ రంగంలో సిద్ధంగా ఉండాలి.
జి.గాయత్రి
99593 23934












