
మహారాష్ట్రలోని థానే జిల్లా భివండీలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు, ముగ్గురు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ భవనాన్ని స్థానిక మున్సిపల్ అధికారులు గతంలోనే ‘ప్రమాదకరమైనది’గా గుర్తించడం గమనార్హం.పవర్‌లూమ్ పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిన భివండీలోని బాలాజీ నగర్‌లో ఉన్న కోహినూర్ భవనంలోని ఓ భాగం గురువారం రాత్రి 11.20 గంటలకు ఒక్కసారిగా కుప్పకూలింది. భవనంలో మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు. ఈ నాలుగు అంతస్తుల భవనంలో ఒక్కో అంతస్తులో 12 చొప్పున మొత్తం 48 గదులు ఉన్నాయి. గురువారం రాత్రి 9 గంటల సమయంలో భవనం నుంచి పెద్దఎత్తున పగుళ్ల శబ్దాలు వినిపించాయని అధికారులు తెలిపారు. ప్రమాదాన్ని పసిగట్టిన స్థానికులు వెంటనే అనేక కుటుంబాలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే మరికొందరు బయటకు వస్తుండగానే భవనంలోని ‘బి’ వింగ్ కుప్పకూలింది.
భివండీ నిజాంపూర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎన్‌సీఎంసీ) ఈ భవనాన్ని 2020 సెప్టెంబరులోనే ‘ప్రమాదకరమైనది’గా గుర్తించింది. ఈ ఏడాది జూన్ 5న భవనాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేసి, అనంతరం విద్యుత్తు, నీటి సరఫరాను కూడా నిలిపివేసింది. అయినప్పటికీ మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే భవన యజమానులు నిర్మాణ మరమ్మతు పనులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ‘అక్రమంగా’ మరమ్మతులు చేపట్టిన కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్), థానే విపత్తు స్పందన దళం, స్థానిక అగ్నిమాపక సిబ్బందితో భారీ సహాయక చర్యలు ప్రారంభించారు. జాగిలాల బృందంతోపాటు నాలుగు అగ్నిమాపక వాహనాలు, రెండు అంబులెన్సులు, భారీ యంత్రాలను రంగంలోకి దించారు. శిథిలాలను తొలగిస్తూ, ఇరుకైన ఖాళీల్లోకి ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది టార్చిలైట్లతో వెళ్లి ప్రాణాలతో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు. శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన ఓ మహిళ తన భయానక అనుభవాన్ని వివరించింది.
బురద, శిథిలాల మధ్య చిక్కుకుపోయిన తనను వెతుకుతూ కొద్ది అడుగుల దూరంలోనే తల్లిదండ్రులు పేరు పెట్టి పిలుస్తున్నా.. తాను ఎంతగా కేకలు వేసినా వారికి వినిపించలేదని తెలిపింది. గంటల తరబడి అక్కడే చిక్కుకున్న తనను సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీశాయని చెప్పింది. నివాసితులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ మరమ్మతు పనులు సక్రమంగా చేపట్టలేదని ఆమె ఆరోపించింది. మరో మహిళ తన కుటుంబం తృటిలో ప్రాణాలతో బయటపడినట్లు తెలిపింది. భవనం పగుళ్లు ఇవ్వడం ప్రారంభించగానే ఎదురింటి వ్యక్తి తమను తన ఇంట్లోకి రావాలని సూచించాడని, ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయమే తన భర్త, ఇద్దరు కుమార్తెలు, తన ప్రాణాలను కాపాడిందని చెప్పింది. “లేకపోతే మేమూ ఆ శిథిలాల కింద సజీవంగా సమాధి అయ్యేవాళ్లం. ఇల్లు, వస్తువులు.. సర్వం కోల్పోయాం” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంతో పలువురు కట్టుబట్టలతో మిగిలిపోయారు. మృతుల్లో ఐదుగురిని షమీమ్ షేక్ (32), రంజీత్ సింగ్ (45), మిరాజ్ రసూల్ షేక్ (34), సంతోష్ కుమార్ పాండే (42), షమీమ్ అన్సారీ (30)గా అధికారులు గుర్తించారు.
ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవనం కూలి పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంత్రి గిరీశ్ మహాజన్ కూడా తొమ్మిది మంది మృతి చెందినట్లు ధ్రువీకరించారు. శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్న మిగిలిన వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.











