
వేసవి తీవ్రత దృష్ట్యా ప్లీనరీకి బదులు కార్యవర్గ సమావేశం
మ.2 గంటలకు అధినేత కెసిఆర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి భేటీ
నియోజకవర్గాల్లోనే ఘనంగా వేడుకలు నిర్వహించాలి
పార్టీ శ్రేణులతో కెటిఆర్ టెలీ కాన్ఫరెన్స్
మన తెలంగాణ/హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీ రజతోత్సవ సంబురాల సందర్భంగా పార్టీ అధినేత కెసిఆర్ అధ్యక్షతన సోమవారం (ఏప్రిల్ 27) ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో మధ్యా హ్నం 2 గంటలకు ఈ భేటీ జరగనుంది. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన గులాబీ బాస్, ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనునే అవకాశం ఉన్నది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం సభ్యత్వాల పునరుద్ధరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు.
మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ క్యాడర్‌ను ఎలా ముందు కు తీసుకెళ్లాలి, సభ్యత్వ నమోదు ప్రక్రియను ఏ విధంగా వేగవంతం చేయాలి అనే విషయాలపై కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. వీటితోపాటు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లకు మాత్రమే ఆహ్వానం ఉందని పార్టీ స్పష్టం చేసింది.
ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురవేయాలి : కెటిఆర్
బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రతి గ్రామం, పట్టణం, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలి -పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బిఆర్‌ఎస్ శ్రేణులను కోరారు. బిఆర్‌ఎస్ రజతోత్సవం సందర్భంగా ఆదివారం పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కెసిఆర్ ఆదేశాల మేరకు ఈసారి ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో పరిమిత సంఖ్యలోనే ప్రవేశం ఉంటుందన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామం, మండలం, పట్టణం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు.














