
మన తెలంగాణ/హైదరాబాద్: ఫార్ములా ఈ- కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మం త్రి కెటిఆర్ శుక్రవారం నాంపల్లి ఎసిబి ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. కోర్టు గతంలో విధించిన షరతుల ప్రకారం విచార ణ తేదీల్లో హాజరవాల్సి ఉండటంతో కెటిఆర్ మరోసారి కోర్టుకు రానున్నా రు. ఫార్ములా ఈ కార్ -రేసు నిర్వహణ కోసం విదేశీ సంస్థకు ప్రభుత్వ అనుమతులు, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండానే నిధులు బదిలీ చేశారనే ఆరోపణలపై ఏసిబి కేసు నమోదు చేసింది. ప్రభుత్వ నిధుల వినియోగంలో నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలతో దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కూడా మనీలాండరింగ్ కోణంలో విచారణ చేపట్టింది.
ఇందులో కెటిఆర్‌తో పాటు మాజీ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, మాజీ హెచ్‌ఎండిఎ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డిలను ఏసిబి నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. మరోవైపు, ఫార్ములా ఈ-రేసు హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికే నిర్వహించామని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు రాజకీయ కక్షసాధింపుగా చూపిస్తున్నారని కెటిఆర్ పలుమార్లు వ్యాఖ్యానించారు. ఈ కేసులో తనపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, చట్టపరంగా పోరాడతానని ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు.











