జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీం విచారణ

‘క్రిమినల్ యాంటిసిడెంట్స్’ అనేది తీవ్రమైన నేరాలకే వర్తిస్తుందని స్పష్టత

విద్యార్థులపై నమోదైన కేసులను ముందుకు తీసుకువెళ్లబోమని కేంద్రం హామీ

ఇచ్చిన హామీని బాధ్యతాయుతంగా అమలు చేయాలని కేంద్రానికి సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనల సందర్భంగా నమోదైన కేసులను ముందుకు తీసుకువెళ్లమంటూ తామిచ్చిన హామీకి కట్టుబడి ఉంటామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జూలై 20న ఢిల్లీలో జరిగిన ఆందోళనలకు సంబంధించిన పిటిషన్లపై అత్యన్నత న్యాయస్థానం సోమవారంనాడు విచారణ జరిపింది. ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణకు ఇచ్చిన హామీని బాధ్యతాయుతంగా అమలు చేయాలని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తక్కిన విద్యార్థులపై పెట్టిన ఎఫ్‌ఐఆర్‌లను చట్టప్రకారం ఉపసంహరించుకునేందుకు రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని తెలిపింది.

దీంతో పలు రాష్ట్రాల్లో కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఊరట లభించే అవకాశం ఉంది. అదేవిధంగా ‘క్రిమినల్ యాంటిసిడెంట్స్’ అనే పదంపై కూడా అత్యున్నత న్యాయస్థానం వివరణ ఇచ్చింది. ఈ పదం హత్య, అత్యాచారం, ఉగ్రవాదం వంటి తీవ్రమైన నేరాలకే వర్తిస్తుందని, చిన్న చిన్న కేసులు ఎదుర్కొంటున్న వారిని ఆ కోవలో చూడరాదని పేర్కొంది. ఢిల్లీ ఎన్‌సీటీ కానీ, ఇతర రాష్ట్రాలు కానీ నిరసనకారులపై కేసుల మూసివేత, ఉపసంహరణకు స్వేచ్ఛ ఉందని సీజేఐ సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయమాల్య బాగ్చి, వి మోహన్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది.

విద్యార్థులపై ఎఫ్‌ఐర్‌ల ఉపసంహరణకు కేంద్రం ఇచ్చిన హామీని ఎలా అమలు చేస్తుందనే దానిపై కొన్ని అపోహలు ఉన్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉందని, నేరచరిత్ర ఉన్నవారిని మినహా, తక్కినవారిపై కేసుల ఉపసంహరణకు కేంద్రం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన 2,700 మందికి పైగా వ్యక్తులకు నేరచరిత్ర ఉందన్నారు. ఇచ్చిన హామీల అమలు విషయంలో లీగల్ మెకానిజం కోసం సీనియర్ అడ్వకేట్ వ్రిందా గ్రోవర్‌తో తాను చర్చిస్తున్నట్టు చెప్పారు.

విద్యార్థులపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఇప్పటికీ సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. పెల్లెట్ తుపాకుల వినియోగంపై సమగ్ర మార్గదర్శకులు రూపొందిస్తామని, ఎలాంటి పరిస్థితుల్లో వాటిని ఉపయోగించవచ్చో నిర్ణయిస్తామని పిటిషన్లపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. తదుపరి విచారణను ఆగస్టు 18వ తేదీకి వాయిదా వేసింది.