న్యూఢిల్లీ: నీట్ యూజీ పరీక్షలో జరిగిన అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, విద్యార్థుల భవిష్యత్తుకు ఎటువంటి భంగం వాటిల్లనివ్వమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చినట్లు మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. మంగళవారం ఎన్డీయే నిర్వహించిన 'మంగళ్ మిషన్' సమావేశం అనంతరం రిజిజు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో నీట్ వివాదం, భారతదేశ ఆర్థిక పురోగతి, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పట్ల ప్రభుత్వ విధానం వంటి పలు అంశాలపై ప్రధాని మోడీ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించాని ఆయన చెప్పారు.

విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు పరీక్షా విధానంలో జవాబుదారీతనానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారని మంత్రి తెలిపారు. "విద్యార్థుల భవిష్యత్తుకు హాని కలిగించే ఏ విషయాన్నీ ప్రభుత్వం సహించదని ప్రధాని అన్నారు. నీట్ పరీక్షలో అక్రమాలకు బాధ్యులుగా తేలిన వారికి కఠిన శిక్షలు తప్పవని.. వారిని జైలుకు పంపిస్తామని ప్రధాని చెప్పారు" అని కిరణ్ రిజిజు తెలిపారు.