లోక్‌సభలో మంగళవారంనాడు యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా డిఎంకె తరపున ఎంపి దయానిధి మారన్ చర్చలో పాల్గొన్నారు. అసలు నీట్ పరీక్షా విధానాన్నే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం పేపర్ లీకేజీలను అరికట్టడానికి అంటూ చేసిన ప్రతిపాదనలు కూడా ఏ మాత్రం పనిచేయవన్నారు. నీట్ అంశంలో రాష్ట్రాల అభ్యంతరాలను కేంద్రం పెడచెవిన పెడుతోందని, అందుకే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని మారన్ అన్నారు. దేశవ్యాప్తంగా 22లక్షల మంది విద్యార్థులు నీట్‌కు హాజరవుతున్నారని,

అందులో 12 లక్షల మంది అర్హత సాధిస్తే ఉన్న సీట్లు మాత్రం 1.39లక్షలు మాత్రమేనని అన్నారు. గణాంకాలు ఇలా ఉంటే మెడికల్ సీట్లు ఎలా సరిపోతాయని నిలదీశారు. తాజా బిల్లుతో ప్రభుత్వ ఉద్దేశం నెరవేరబోదని టిఎంసి ఎంపి అభిషేక్ బెనర్జీఅన్నారు. లక్షలాది యువత ఎదుర్కొన్న అవమానాన్ని ఎలా మరిచిపోగలమన్నారు. అయితే బిల్లుకు తమ మద్దతు ఉంటుందని, పరీక్షల్లో పేపర్ లీకేజీలకు అరికట్టేందుకు ఈ ప్రతిపాదనలు మాత్రం సరిపోవన్నారు.