నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం ఎంతో మంది విద్యార్థులను బాధించింది. అయితే నీట్ పరీక్ష పేపర్ లీక్‌కి తాను బాధితురాలినే అని ప్రముఖ బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ పేర్కొన్నారు. 2015లో నీట్ పేపర్ లీక్ కావడం వల్ల తాను మళ్లీ పరీక్ష రాయాల్సి వచ్చిందని తెలిపారు. తనకు కూచిపూడి, పెయింటింగ్ అంటే ఎంతో ఇష్టమని తెలిపిన ఆమె.. వాటిని ఏడది పాటు పక్కన పెట్టి పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యానని అన్నారు. డాక్టర్ కావాలని తాను ఎన్నో కలలు కన్నానని.. కష్టపడి చదివి, పరీక్ష రాసినప్పటికీ.. పేపర్ లీక్ కావడంతో అప్పట్లో చాలా కఠినమైన దశను ఎదుర్కొన్నట్లు వెల్లడించారు.

ఇప్పటికీ విద్యార్థులు అలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కోవడం బాధాకరమని మానుషి అన్నారు. పరీక్ష కోసం మళ్లీ మళ్లీ చదవడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె తన అనుభవాలను పంచుకున్నారు.