ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు గత ప్రభుత్వంలో నేరేళ్లలో జరిగిన ఘటన బాధితులను పరామర్శించేందుకు టూరిస్టులా తాను రాలేదని ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కోసం పోరాడుతానని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరేళ్ల గ్రామంలో అనారోగ్యంతో చనిపోయిన గంధం గోపాల్ కుటుంబాన్ని కలిసి ఆమె పరామర్శించారు. పార్టీ పరంగా అండగా నిలుస్తామని హామీనిచ్చారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అందరి బతుకులు బాగుపడతాయని ఆశిస్తే నేరేళ్ల ఘటన సమాజం తలదించుకునేలా చేసిందన్నారు. తొమ్మిదేళ్లు ప్రభుత్వం నుంచి బాధితులకు రూపాయి సాయం కూడా అందలేదన్నారు. నేరేళ్ల బాధితుల కన్నీళ్ల పునాదుల మీద అధికారం అనుభవిస్తున్న నాయకులు వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందివ్వాలని డిమాండ్ చేశారు.

సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని వారి పిల్లల భవిష్యత్తును బాధ్యతగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐదు రోజుల పాటు ఎనిమిది మందిని ఇష్టానుసారంగా పోలీసులు కొట్టారని, జైలర్ కూడా వారిని జైళ్లోకి తీసుకోవడానికి నిరాకరించారని గుర్తుచేశారు. ఈ సంఘటనపై ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకువచ్చారని, ఆ కమిషన్ నివేదిక ఇప్పటికీ బయటికి రాలేదన్నారు. అవసరమైతే బాధితులతో కలిసి ఢిల్లీకి వెళ్తామని ఎస్సీ కమిషన్ నివేదిక కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. నేరేళ్ల బాధితులను వాడుకొని సీఎం రేవంత్ రెడ్డి ఓట్లు వేయించుకున్నారని కవిత ఆరోపించారు. కానీ, గెలిచి 30 నెలలు గడుస్తున్నా నేరేళ్ల పేరెత్తటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత మానవత్వం లేకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. న్యాయం జరిపిస్తామంటూ మీరా కుమారిని కూడా అప్పట్లో ఇక్కడికి తీసుకొచ్చారని పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు మీ మానవత్వం ఏమైందంటూ ప్రశ్నించారు. బాధితుడు గంధం గోపాల్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి చనిపోయాడని విచారం వ్యక్తం చేశారు.

ఈ దాష్టీకానికి పాల్పడిన పోలీసులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటేనే ప్రజలను కొట్టొద్దనే భయం ఉంటుందన్నారు. అనంతరం థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో తీవ్రంగా గాయపడిన బాధితులను కవిత పరామర్శించారు. బాధితుడు బాణయ్య నివాసంలో హరీష్ సహా ఇతర బాధితులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేరేళ్ల బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఆమె వెంట జిల్లా, మండల టీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.