
న్యూఢిల్లీ: పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాధార సూచికలు (వైటల్ పారామీటర్లు) స్థిరంగా ఉన్నాయని, అయితే ఇంట్రావీనస్ ద్రవాలు, గ్లూకోజ్ తీసుకోవడానికి ఆయన నిరాకరిస్తున్నారని సఫ్దర్ జంగ్ ఆసుపత్రి వర్గాలు మంగళవారంనాడు తెలిపాయి. ఈ మేరకు ఒక హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు.
ప్రస్తుతం ఆయన రక్తంలో చక్కెర స్థాయి ఇంకా తక్కువగానే ఉందని, సీరమ్ పొటాషియం స్థాయి సాధారణ స్థాయి కంటే తక్కువగా 3.2 ఎంఈక్యూ/ఎల్‌గా నమోదైందని తెలిపింది. నోటి ద్వారా పొటాషియం మందులు ఇస్తున్నామని తెలిపింది. అవసరమైన అన్నిరకాల వైద్య పరీక్షలు చేస్తున్నామని వివరించింది. అయితే దీర్ఘకాల ఉపవాసం, డీహైడ్రేషన్, రక్త పరీక్షల్లో కనిపిస్తున్న ఫలితాల కారణంగా ఆయనను నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉంచి వరుస పరీక్షలు నిర్వహించడం అవసరమని వైద్యులు పేర్కొన్నారు.











