
వెయ్యి మంది రోగులకు రొబోటిక్ సర్జరీలు
వైద్య బృందానికి సిఎం రేవంత్‌రెడ్డి అభినందనలు
మనతెలంగాణ/హైదరాబాద్ : నిమ్స్ హాస్పిటల్ మరో ఘనతను సాధించింది. రెండున్నర సంవత్సరాల వ్యవధిలోనే నిమ్స్ హాస్పిటల్‌లో వెయ్యి రొబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. వెయ్యి రొబోటిక్ సర్జరీల్లో యూరాలజీ విభాగంలో 590, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో 248, సర్జికల్ ఆంకాలజీ విభాగంలో 162 శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ మేరకు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ సోమవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహని కలిసి నిమ్స్ సాధించిన ఈ ఘనతను వివరించారు. ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్‌తో పాటు రొబోటిక్ సర్జరీల్లో భాగస్వాములైన డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బందిని మంత్రి అభినందించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో నిమ్స్ కీలక పాత్ర పోషిస్తోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఇటీవలే నిమ్స్‌లో 2 వేల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడం, ఇప్పుడు వెయ్యి రొబోటిక్ సర్జరీల మైలురాయిని చేరుకోవడం ప్రభుత్వ వైద్యరంగ సామర్థ్యానికి నిదర్శనమని మంత్రి వ్యాఖ్యానించారు. దక్షిణ భారతదేశంలో ప్రభుత్వ రంగంలో తొలి రొబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన నిమ్స్, దేశంలోనే ప్రముఖ అవయవ మార్పిడి కేంద్రాల్లో ఒకటిగా నిలిచిందని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వైద్య సేవలను మరింత విస్తరిస్తోందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం నిమ్స్‌తో పాటు ఎంఎన్‌జె క్యాన్సర్ హాస్పిటల్లో కూడా రొబోటిక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. నిర్మాణంలో ఉన్న కొత్త టిమ్స్ హాస్పిటళ్లతో పాటు గాంధీ, కొత్త ఉస్మానియా హాస్పిటల్లోనూ అత్యాధునిక రొబోటిక్ ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేసి, ప్రపంచ స్థాయి వైద్య సేవలను ప్రభుత్వ రంగంలోనే అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు.
సామాన్యులకు అందుబాటులో రొబోటిక్ సర్జరీలు: నిమ్స్ డైరెక్టర్
నిమ్స్‌లో ఇప్పటివరకు నిర్వహించిన వెయ్యి రొబోటిక్ సర్జరీల్లో యూరాలజీ విభాగంలో 590, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో 248, సర్జికల్ ఆంకాలజీ విభాగంలో 162 శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. ఈ శస్త్రచికిత్సల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్‌ఎఫ్) వంటి ప్రభుత్వ పథకాల ద్వారా రోగులకు పూర్తిగా ఉచితంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఖరీదైన రొబోటిక్ సర్జరీలను కూడా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలిగామని చెప్పారు. ఈ విజయానికి యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, అనస్థీషియా విభాగాలు, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ బృందం, ఇతర సహాయక విభాగాల సమిష్టి కృషి కారణమని నిమ్స్ డైరెక్టర్ చెప్పారు. రాష్ట్రంలో ఆధునిక వైద్య సేవల బలోపేతానికి నిరంతరం సహకరిస్తున్న ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా డాక్టర్ రాహుల్ దేవరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో నిమ్స్ మరిన్ని మైలురాళ్లు సాధించే దిశగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
నిమ్స్ వైద్య బృందానికి సిఎం రేవంత్ రెడ్డి అభినందనలు
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించినందుకు నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్‌తో పాటు వైద్య బృందం, నర్సింగ్ సిబ్బంది,ఆపరేషన్ థియేటర్ బృందానికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రజా ప్రభుత్వ సంకల్పం నెరవేరిందన్నారు.నిమ్స్‌లో ఇప్పటివరకు నిర్వహించిన రొబోటిక్ సర్జరీల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా నిర్వహించడం ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయమని పేర్కొన్నారు. ఇటీవలే రెండు వేల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసిన నిమ్స్, ఇప్పుడు వెయ్యి రొబోటిక్ సర్జరీల మైలురాయిని చేరుకోవటం ద్వారా కొత్త రికార్డు నెలకొల్పిందని అన్నారు. వైద్య రంగంలో నిమ్స్ మరిన్ని మైలురాళ్లు సాధించాలని సిఎం ఆకాంక్షించారు.











