
న్యూఢిల్లీ: 'ఛలో పార్లమెంటు' పేరుతో కాక్రోచ్ జనతా పార్టీ(సిజెపి) చేపట్టిన పాదయాత్ర సందర్భంగా నిరసనకారులపై జరిగిన హింసాత్మక ఘటనపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు హైకోర్టు బుధవారం నోటీసు జారీ చేసింది. సిజెపి ఆందోళనకారులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈనేపథ్యంలో విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాలతో కూడిన ధర్మాసనం.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ ఘటనపై నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని.. ప్రభుత్వాన్ని, పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. ఈలోగా, ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, వీడియోగ్రఫీ, బాడీ క్యామ్ ఫుటేజ్, ఇతర సంబంధిత రికార్డులను భద్రపరచాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు న్యాయస్థానం వాయిదా వేసింది.











