రూ.15 లక్షల బడ్జెట్‌లో కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ కొనుగోలు చేయాలనుకునే వారికి నిస్సాన్ టెక్టన్, హ్యుందాయ్ క్రెటా రెండు బలమైన ఎంపికలుగా నిలుస్తున్నాయి. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన నిస్సాన్ టెక్టన్ ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లు, మెరుగైన భద్రతతో దృష్టిని ఆకర్షిస్తుండగా..హ్యుందాయ్ క్రెటా మాత్రం ఎన్నో ఏళ్లుగా విశ్వసనీయ పనితీరు, బలమైన సర్వీస్ నెట్‌వర్క్‌తో వినియోగదారుల ఆదరణ పొందుతోంది. మరి ఈ రెండింటిలో ఏ ఎస్‌యూవీ మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుందో చూద్దాం.



ధర, డిజైన్

నిస్సాన్ టెక్టన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.49 లక్షలు. టాప్ వేరియంట్ ధర రూ.18.59 లక్షల వరకు ఉంది. హ్యుందాయ్ క్రెటా ప్రారంభ ధర రూ.10.91 లక్షలు కాగా, టాప్ వేరియంట్ రూ.20.11 లక్షల వరకు అందుబాటులో ఉంది. డిజైన్ పరంగా టెక్టన్ బోల్డ్, మస్క్యులర్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఇందులో పెద్ద ఫ్రంట్ గ్రిల్, LED DRLs, కనెక్టెడ్ టెయిల్‌లైట్స్, 18 అంగుళాల అలాయ్ వీల్స్ ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా మాత్రం ప్రీమియం, ఫ్యామిలీ-ఫ్రెండ్లీ డిజైన్‌తో కనిపిస్తుంది.



క్యాబిన్, ఫీచర్లు

నిస్సాన్ టెక్టన్ ఇంటీరియర్ ట్రై-టోన్ థీమ్, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, 48 కలర్ అంబియెంట్ లైటింగ్‌తో ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. ఇందులో డ్యూయల్ 10.25 అంగుళాల డిస్‌ప్లేలు, పవర్డ్ టెయిల్‌గేట్, వెంటిలేటెడ్ సీట్లు, 700 లీటర్ల భారీ బూట్ స్పేస్ ఉన్నాయి. మరోవైపు..హ్యుందాయ్ క్రెటా కూడా ఫీచర్ల విషయంలో ఏమాత్రం తగ్గదు. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Bose సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, పానోరమిక్ సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.


భద్రతలో ఏది మెరుగైనది?

ఈ రెండు SUVల్లోనూ 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, పలు అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. అయితే నిస్సాన్ టెక్టన్ కు 5-స్టార్ BNCAP సేఫ్టీ రేటింగ్ లభించడం ప్రత్యేక ఆకర్షణ. అదనంగా లెవెల్-2 ADAS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.


ఇంజిన్, మైలేజ్

నిస్సాన్ టెక్టన్ లో టర్బో పెట్రోల్ ఇంజిన్ మాత్రమే లభిస్తుంది. ఇందులో 1.0-లీటర్, 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. ఇవి మెరుగైన పవర్, టార్క్‌ను అందిస్తాయి. అలాగే హ్యుందాయ్ క్రెటాలో పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ మూడు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ దూరాలు ప్రయాణించే వారికి డీజిల్ వేరియంట్ మెరుగైన మైలేజ్‌ను అందించే అవకాశం ఉంది.


ఏ ఎస్‌యూవీ కొనుగోలు చేయాలి?

మీకు స్టైలిష్ డిజైన్, అత్యుత్తమ భద్రత, పెద్ద బూట్ స్పేస్, లేటెస్ట్ టెక్నాలజీ ముఖ్యమైతే నిస్సాన్ టెక్టన్ మంచి ఎంపిక కావచ్చు. అయితే డీజిల్ ఇంజిన్ ఎంపిక, విశ్వసనీయ సర్వీస్ నెట్‌వర్క్, ఇప్పటికే మార్కెట్లో నిరూపితమైన పనితీరు కోరుకునే వారికి హ్యుందాయ్ క్రెటా ఇప్పటికీ బలమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.