
మన తెలంగాణ/హైదరాబాద్: 22 ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22 ఎ జాబితాలో భూమి ఉందన్న కారణంతోనే రిజిస్ట్రేషన్ దరఖాస్తులను తిరస్కరించవద్దని, ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి ఎలాంటి జాప్యం లేకుండా న్యాయం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బుధవారం మంత్రి పొంగులేటి 22 ఏ అంశంపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సంప్రదింపులు జరిపారు. మంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్లు సబ్ రిజిస్ట్రార్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ 22 ఏ జాబితాకు సంబంధించి ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు.
సంబంధిత భూమి 22 ఏ నిషేధిత జాబితాలోకి ఎందుకు వచ్చింది? అందుకు సంబంధించిన రికార్డులు ఏమి చెబుతున్నాయి? ప్రస్తుతం భూమి వాస్తవ పరిస్థితి ఏమిటీ? హక్కుదారుడి వద్ద ఉన్న పత్రాలు ఏమిటీ? గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ రికార్డుల్లోని వివరాలు ఏమిటీ? వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు. రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేని వాటికి రిజిస్ట్రేషన్ ఎందుకు సాధ్యం కాదో దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలని, నిబంధనల ప్రకారం ముందుగా చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజును తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. 22 ఏ భూముల విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు, ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల హక్కులను కాపాడుతూనే ప్రభుత్వ భూములను కూడా పరిరక్షిస్తూ, ప్రతి కేసును చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.
క్లియరెన్స్ వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాం: నారపల్లి సబ్ రిజిస్ట్రార్ సునీల్
క్లియరెన్స్ వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించామని నారపల్లి సబ్ రిజిస్ట్రార్ సునీల్ తెలిపారు. పోచారం గ్రామంలోని సర్వే నంబర్ 50ను ఎపి హౌసింగ్ బోర్డు భూమిగా పేర్కొంటూ గత ఏడాది డిసెంబర్‌లో 22 ఏజాబితాలో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఇటీవల కలెక్టర్ నుంచి క్లియరెన్స్ వచ్చింది. వెంటనే గతంలో రిజిస్ట్రేషన్ కోసం మమ్మల్ని సంప్రదించిన వారికి ఫోన్ చేసి సమాచారం అందించాం. వారు కార్యాలయానికి వచ్చిన వెంటనే నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నాం..
300 ప్లాట్లను నిషేధిత జాబితా నుంచి తొలగించడం సంతోషం: కొనుగోలుదారు చక్రపాణి
మా సొసైటీలోని 300 ప్లాట్లకు పూర్తి విముక్తి కలిగిందని ప్లాట్ల కొనుగోలుదారు చక్రపాణి తెలిపారు. కూకట్‌పల్లి అడ్డగుట్ట సొసైటీలోని నెంబర్ 80సిలో ఉన్న 250 గజాల స్దలాన్ని నెలరోజుల క్రితం కొనుగోలు చేశాను. అయితే, రిజిస్ట్రేషన్ కోసం కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే ఆభూమి 22ఎ నిషేధిత జాబితాలో ఉందని రిజిస్ట్రేషన్ చేయలేదు. తాజాగా, ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా నాకు మంగళవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. బుధవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అంతేగాక మా సొసైటీలోని 300 ప్లాట్లను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు అధికారులు చెప్పారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి చక్రపాణి కృతజ్ఞతలు- తెలిపారు.
వెంటనే సమస్యను పరిష్కరించడం ఆనందంగా ఉంది:ప్లాట్ విక్రయదారుడు రాజేంద్రప్రసాద్
ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల రిజిస్ట్రేషన్ పూర్తయ్యిందని ప్లాట్ విక్రయదారుడు రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని మూసాపేట్‌లోని రెయిన్ బో విస్టాలో ఉన్నప్లాట్ నెంబర్ 804 ను విక్రయించేందుకు కొద్దికాలం క్రితం యజమాని వెంకట విజయ్‌కుమార్ ప్రయత్నించారు. అయితే, ఈ ప్లాట్ 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నందున రిజిస్ట్రేషన్ జరగలేదు. వెంకట విజయ్‌కుమార్ ఆస్ట్రేలియా వెళ్లిపోతూ తన మామ రాజేంద్రప్రసాద్‌కు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. ఈనెల 12న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సమాచారం రావడంతో బుధవారం రాజేంద్రప్రసాద్ వెళ్లి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఈ అంశం చాలాకాలం పడుతుందని భావించానని కానీ, వెంటనే సమస్యను పరిష్కరించడం ఆనందంగా ఉందన్నారు.
మాకు 2005లో సీలింగ్ పర్మిషన్ వచ్చింది: వైష్ణవి ఎస్టేట్ ప్రతినిధి శ్రీనివాస్
మాకు 2005లో సీలింగ్ పర్మిషన్ వచ్చింది. తాము రిజిస్ట్రేషన్ కోసం అప్పటినుంచి ప్రయత్నం చేస్తున్నాం. తాజాగా రెండు వారాల క్రితం బాలానగర్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ కోసం వెళితే 22ఏలో పెట్టామని చెప్పారు. తాము కలెక్టర్‌ను కలిశాం. వెంటనే దానిని క్లియర్ చేశారు. బుధవారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తిచేశాం. ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ అయ్యిందని వైష్ణవి ఎస్టేట్ ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు. గతంలో మూసాపేట సర్వే నెంబర్ 108లోని భూమిని విక్రయించడానికి చాలా ఇబ్బందులు పడ్డానని, 22ఎ నిషేధిత జాబితాలో ఉందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తిరస్కరించారని ఆయన తెలిపారు.
పలు సర్వే నెంబర్లలో నిషేధం తొలగింపు : బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ సహదేవ్
బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని సర్వే నెంబర్లు 101/1, 101/2, 102, 108, 109, 112, 81లో ఉన్న సుమారు 3,000 చదరపు మీటర్ల స్థలంపై ఉన్న 22ఏ నిషేధం తొలగిపోయింది. ఈ సర్వే నెంబర్లలో ఉన్న భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ సహదేవ్ స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో వెంటనే రిజిస్ట్రేషన్ చేపట్టామని ఆయన తెలిపారు.








