మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రై వేట్ పాఠశాలల్లో ఫీజుల వివరాలను పాఠశాల నోటీసు బోర్డు, వెబ్‌సైట్‌తో పాటు పాఠశాల వి ద్యాశాఖ పోర్టల్‌లోనూ పొందుపరచాలని డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు వివరాలను అన్ని ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా బహిరంగంగా ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ఫీజులను ఎలా నిర్ణయించారు అనే అంశాలకు సంబంధించి పాఠశాల గవర్నింగ్‌బాడీ సభ్యుల సంతకాలతో కూడిన డా క్యుమెంట్లను కూడా పోర్టల్‌లో పొందుపరచాల ని స్పష్టం చేశారు. నోటీస్ బోర్డుపై తరగతి వారీ గా ఫీజు వివరాలను ప్రదర్శించాల్సి ఉంటుందని, పాఠశాల అధికారిక వెబ్‌సైట్‌లో పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ schooledu.telangana. gov.in

పోర్టల్‌లో తప్పనిసరిగా ఫీజు వివరాలను నమోదు చేయాలని అన్నారు. నిబంధనలు పాటించని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, 2026 -27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజుల స్ట్రక్చర్ ప్రదర్శించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆర్‌జెడిలు, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్ల ల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పడుతున్న ఆ రాటాన్నీ ప్రైవేట్ పాఠశాలలు సొమ్ము చేసుకుంటున్నాయి. స్కూళ్లు కూడా స్టేటస్ సింబల్‌గా మారుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లన్నీ కేవలం నిరుపేదలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాలు కేటగిరీల వారీగా స్కూళ్లను ఎంపిక చేసుకునే పరిస్థితి నెలకొంది.


స్కూళ్లలో ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా, అర్హులైన ఉపాధ్యాయులు లేకపోయినా తమ పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో చదవడమే కనీస గౌరవంగా భావిస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రైవేట్ పాఠశాలలు కూడా అప్‌గ్రేడ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఏదో ఒక పేరున్న ప్రైవేట్ స్కూళ్లో చేర్పించాలని భావించిన తల్లిదండ్రులను ప్రస్తుతం సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ సిలబస్‌ను అనుసరించే పాఠశాలలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తల్లిదండ్రుల బలహీనతలను అడ్డంపెట్టుకుని సిబిఎస్‌ఇ, ఇంటర్నేషనల్ స్కూళ్లు ఇష్టారీతిన ఫీజులు దండుకుంటున్నారు. ఒకసారి తమ పాఠశాలలో చేర్పించిన తర్వాత ఎక్కడికి వెళ్లరనే ధీమాతో యాజమాన్యాలు ఇష్టారీతిన ఫీజులు పెంచుతున్నాయి. ఏటా కనీసం 30 నుంచి 60 శాతం ఫీజులు పెరుగుతుండగా, కొన్ని పాఠశాలలు 100 శాతం కూడా పెంచుతున్నాయి. ఇలా ఏటా పెరుగుతున్న ఫీజుల భారం భరించలేక తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఫీజుల నియంత్రణ కరువు

ప్రైవేట్ స్కూల్‌ల్లో ఫీజుల నియంత్రణ లేకపోవడంతో కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ నచ్చినవిధంగా ఫీజులు నిర్ణయించారు. కొన్ని పాఠశాలలు ఒకేసారి ఏకంగా 50 శాతానికి పైగా ఫీజులు పెంచాయి. ఫీజుల క్రమబద్ధీకరణకు తగిన నిబంధనలు లేకపోవడంతోనే ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతున్నాయి. ప్రైవేట్ స్కూల్ ఫీజు నియంత్రణపై గత కొన్నేళ్లుగా ప్రభుత్వం కేవలం ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలో పెట్టడం లేదు. గత ఏడాదిన్నర కాలంగా పాఠశాల ఫీజులు నియంత్రించేందుకు నిబంధనలను అమలులోకి తెచ్చేందుకు బిల్లు సిద్ధమైనప్పటికీ అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. కేబినెట్ భేటీలో చర్చించి అవసరమైన మార్పులు చేర్పులు చేసి బిల్లు రూపొందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, వివిధ కారణాలతో ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణకు సంబంధించిన నిబంధనల రూపకల్పన ఏటా వాయిదా పడుతూనే ఉంది. పీజుల నియంత్రణపై ప్రస్తుతం తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. వచ్చే విద్యాసంవత్సరం 2027 -28 ప్రారంభం నాటికి ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.