ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా బాధితురాలి కుటుంబానికి న్యాయం

దర్యాప్తులో జాప్యం వద్దు.. నిరంతరం పర్యవేక్షించండి పోలీస్

ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్: నగర శివార్లలోని తుక్కుగూడలో ప్రైవేట్ ఆసుపత్రి నర్సు హత్యాచారానికి గురైన దారుణ ఘటనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్రంగా మేజిస్టీరియల్ విచారణ జరిపించాలని అధికారులను ఆయన ఆదేశించారు. విచారణలో భాగంగా బాధితురాలు ఉంటున్న వసతి ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సంబంధిత సంస్థ నిర్వహణలో ఏవైనా నిర్లక్ష్యాలు ఉన్నాయా, మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించిన నిబంధనలు సక్రమంగా అమలయ్యాయా తదితర అంశాలన్నింటినీ నిశితంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో, దర్యాప్తును అత్యంత పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. ఫోరెన్సిక్ నివేదికలు, ఇతర సాంకేతిక ఆధారాల సేకరణను శరవేగంగా పూర్తి చేసి, సమగ్ర ఛార్జ్‌షీట్ దాఖలు చేసేలా పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసును నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందించే లక్ష్యంతో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టేందుకు అవసరమైన చర్యలను తక్షణమే ప్రారంభించాలన్నారు. కేసు విచారణలో ఎలాంటి జాప్యం జరగకుండా న్యాయ, పోలీసు, ప్రాసిక్యూషన్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ కేసులో నేరానికి పాల్పడిన వ్యక్తికి చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ జరగాలని, ఈ ఘటనకు కారణమైన వ్యవస్థాపరమైన లోపాలను గుర్తించి వెంటనే సరిదిద్దాలని సీఎం చెప్పారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా వీలైనంత త్వరగా కేసు విచారణ పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.