
జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలలో సన్నాహాలు
పోలింగ్ కేంద్రాల పునర్వవస్థీకరణలో అధికారులు
మారనున్న మేయర్, కౌన్సిలర్ల రిజర్వేషన్లు
మన తెలంగాణ/సిటీబ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ)లకు వచ్చే నవంబర్ చివరలో ఎన్నికలు జరుగనున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే సన్నాహాల్లో అధికారులు నిమగ్నమయ్యారనేది తెలిసింది. గుట్టుచప్పుడు కాకుండా మున్సిపిల్ కార్పొరేషన్‌ల పోలింగ్‌స్టేషన్‌ల పునర్వవస్థీకరణను జీహెచ్‌ఎంసీ అధికారులు చేస్తున్నట్టు తెలిసింది.
కొత్తగా రెండు సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌లు ఆవిర్భవించిన నేపథ్యంలో వాటిలోని పోలింగ్‌స్టేషన్‌లు, వార్డుల పునర్విభజన ప్రక్రియను కూడా చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారనేది సమాచారం. ముఖ్యంగా ఈవీఎంలు, వాటిని భద్రపరిచిన గోదాంలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ తనిఖీ చేశారు. వాటి పరిస్థితులను కమిషనర్‌లు అంచనా వేయడం, అవసరమైన మరిన్ని ఈవీఎంలను తెప్పించేందుకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు సమాచారం. ఓటరు జాబితాను రూపొందించడం, వార్డుల డీ లిమిటెషన్‌పై మున్సిపల్ అధికారులు దృష్టిసారించారనేది తెలిసింది.
పునర్వవస్థీకరణలో..
ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలలోని పోలింగ్ స్టేషన్‌లలో హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపడుతున్నారనేది సమాచారం. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల ప్రకారం 1200 మందికిపైగా ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్‌లను విభజించి కొత్త పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటుచేసే దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం 47,36,669 ఓటర్లు, వీటి ఆధారంగా 4062 పోలింగ్ కేంద్రాలున్నాయనేది రికార్డులు వెల్లడించాయి. ఓటరు జాబితాను శుద్ధి చేయడం (ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓటర్ లిస్టు)పై అధికారులు ఫోకస్ పెట్టారనేది అధికార వర్గాల సమాచారం. మూడు మున్సిపల్ కార్పొరేషన్‌లు ఆవిర్భవించిన సందర్భంలో పోలింగ్ కేంద్రాలు చీలిపోయాయి. అందులోని ఓటర్లను పరిగణనలోకి తీసుకొని, ఓటర్లకు సమీపంలోనే పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటుచేయడంపై గ్రేటర్ అధికారులు దృష్టిసారించినట్టు తెలిసింది.
మళ్లీ డీలిమిటేషన్..
జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం ఉన్న 150 మున్సిపల్ ఎన్నికల వార్డుల్లో ఎలాంటి మార్పు చేయడం లేదనీ, రిజర్వేషన్‌లు కూడా దాదాపుగా ప్రస్తుతం అంటే ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చేసిన రిజర్వేషన్ల ప్రకారం జీహెచ్‌ఎంసీలోని 150 వార్డుల రిజర్వేషన్ కొనసాగుతుందనేది తెలిసింది. సైబరాబాద్ కార్పొరేషన్‌లో 76 వార్డులను 100 వార్డులుగా, మల్కాజిగిరి కార్పొరేషన్‌లో 74 వార్డులను కూడా 100 వార్డులుగా చేసే విధంగా వార్డుల పునర్విభజన చేయనున్నట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఓటరు జాబితా వెలువడగానే ఓటర్లు 10 శాతం హెచ్చుతగ్గులతో ఎన్నికల వార్డుల పునర్విభజన ప్రక్రియను చేపట్టి, వార్డుల రిజర్వేషన్లను కూడా ఖరారు చేస్తారనేది సమాచారం.








