కొత్త జీఎస్టీ శ్లాబ్ ప్రయోజనాన్ని పొందడానికి బజాజ్ మోటార్‌సైకిల్స్ తమ ఇంజిన్‌ల పరిమాణాన్ని తగ్గించడం ప్రారంభించింది. ఈ శ్లాబ్ ప్రకారం 350 cc కంటే తక్కువ సామర్థ్యం ఉన్న మోటార్‌సైకిళ్లపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అయితే, కంపెనీ ఇటీవల తమ బజాజ్ NS400Z చిన్న వేరియంట్‌ను విడుదల చేసింది. ఇక అంతకుముందు బజాజ్ యాజమాన్యంలోని కేటీఎం, కేటీఎం 390 డ్యూక్ 349 cc వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలో ఈ రెండు మోటార్‌సైకిళ్లలో ఒకదాన్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, బజాజ్ NS400Z, KTM 390 డ్యూక్‌  లో ఏది కొంటె బెటర్ గా ఉంటుందో ఈ ఆర్టికల్ ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. 


బజాజ్ పల్సర్ NS400Z vs కేటీఎం 390 డ్యూక్: ఇంజిన్, పనితీరు

బజాజ్ పల్సర్ NS400Z, KTM 390 డ్యూక్ రెండూ కొత్త 349.13 cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో వస్తాయి. ఇది మునుపటి 373 cc ఇంజిన్ స్థానంలో వచ్చాయి. బజాజ్ NS400Z ఇప్పుడు 9,000 rpm వద్ద 40 హార్స్‌పవర్, 7,500 rpm వద్ద 33.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మునుపటి కంటే కొద్దిగా తక్కువ. మరోవైపు..కొత్త 350 cc ఇంజిన్‌తో వచ్చిన కేటీఎం 390 డ్యూక్, 41.5 hp గరిష్ట శక్తిని, 33.5 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది NS400Z కంటే కొద్దిగా మెరుగైనది.


బజాజ్ పల్సర్ NS400Z vs కేటీఎం 390 డ్యూక్: ఫీచర్లు

బజాజ్ NS400Zలో రైడర్-అసిస్ట్ ఫీచర్లు ఉన్నాయి. వీటిలో ఎంచుకోదగిన రైడ్ మోడ్‌లు ఉన్నాయి. మెరుగైన స్థిరత్వం కోసం ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా అందించారు. బ్లూటూత్ కనెక్టివిటీ, ఒక స్మార్ట్ ఫోర్-వే సెలక్షన్ కంట్రోల్ స్విచ్ ఈ ఫంక్షన్లను సులభంగా, సౌకర్యవంతంగా నిర్వహించడానికి వీలు కల్పిస్తాయి. కేటీఎం 390 డ్యూక్ ఫీచర్ల విషయానికి వస్తే..ఇందులో 5-అంగుళాల TFT డాష్ డిస్‌ప్లే ఉంది. మోటార్‌సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ (MTC), స్ట్రీట్, రెయిన్ రైడ్ మోడ్‌లు, ట్రాక్ స్క్రీన్, లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, రైడ్-బై-వైర్, క్విక్‌షిఫ్టర్+, సూపర్‌మోటో ఏబీఎస్, ఒక టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి.

బజాజ్ NS400Zలో 43mm USD ఫ్రంట్ సస్పెన్షన్, నైట్రాక్స్ రియర్ మోనోషాక్ ఉన్నాయి. కంపెనీ అద్భుతమైన గ్రిప్, నియంత్రణ కోసం, దీనికి ముందువైపు 110/70, వెనుకవైపు 140/70 సైజులో 17-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు అమర్చింది. ఇది 168mm గ్రౌండ్ క్లియరెన్స్, 1,344mm వీల్‌బేస్, 807mm రైడర్ సీట్ ఎత్తును కలిగి ఉంది. దీనికి 12-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 174kg కర్బ్ వెయిట్ ఉన్నాయి. మరోవైపు..కేటీఎం 390 డ్యూక్ శక్తివంతమైన బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో రేడియల్ కాలిపర్‌తో కూడిన 320mm ఫ్రంట్ డిస్క్, ఫ్లోటింగ్ కాలిపర్‌తో కూడిన 240mm రియర్ డిస్క్ ఉంటాయి. దీని సస్పెన్షన్, ఛాసిస్ 183 mm గ్రౌండ్ క్లియరెన్స్, 800 mm నుండి 820 mm వరకు సర్దుబాటు చేయగల సీట్ ఎత్తును అందిస్తాయి. ఇది వివిధ రైడర్‌లకు అనుకూలంగా ఉంటుంది. 15-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ మరియు 168.3 kg కర్బ్ వెయిట్‌తో, 390 డ్యూక్ అద్భుతమైన పనితీరును అందిస్తుంది. 


బజాజ్ పల్సర్ NS400Z vs కేటీఎం 390 డ్యూక్: ధర

వాహనాల పవర్, పనితీరులో కొద్దిగా తేడా ఉన్నప్పటికీ, ఈ రెండు పెర్ఫార్మెన్స్ బైక్‌ల మధ్య అతిపెద్ద తేడా వాటి ధర. బజాజ్ NS400Z ప్రారంభ ధర రూ.1.94 లక్షలు (ఎక్స్-షోరూమ్). కొత్త 350 cc ఇంజిన్‌తో వచ్చే కేటీఎం 390 డ్యూక్ ధర రూ.2.77 లక్షలు (ఎక్స్-షోరూమ్).