హైదరాబాద్: చదువురాని సిఎం రేవంత్ రెడ్డి సోదరులంతా పెద్ద పెద్ద కంపెనీలకు యజమానులు అవుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. అనుముల కొండల్ రెడ్డి టెసరాక్ కంపెనీ ఛైర్మన్ అని లింక్ డిన్ ప్రొఫైల్ లో పెట్టుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఒక్క ఉద్యోగి కూడా లేకుండా కొత్త కొత్త కంపెనీలు ఏర్పాటు చేశారని, చిన్న చిన్న ఇంటి అడ్రస్ తో పెద్ద పెద్ద కంపెనీలు రిజిస్టర్ చేయించారని కెటిఆర్ విమర్శించారు. ఊరు పేరు లేని కంపెనీలకు రూ.200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమి కేటాయించారని, రేవంత్ రెడ్డి మరో సోదరుడు జగదీశ్ రెడ్డి కాంట్రాక్టు చేసుకున్నారని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డికి సింగరేణిలో కాంట్రాక్టర్లు ఇచ్చారని, కొండల్ రెడ్డికి కోట్ల విలువైన స్థలాన్ని గజం రూ. 750 చొప్పున కేటాయించారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న భూకేటాయింపులను వదిలిపెట్టేది లేదని కెటిఆర్ హెచ్చరించారు. సిఎం అల్లుడి ఫార్మా కంపెనీ కోసం కొడంగల్ గిరిజనుల భూములు లాక్కున్నారని, ముఖ్యమంత్రి కుటుంబమంతా దోపిడీ చేస్తుంటే..మంత్రులు వంతపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి రెడ్డి కనీసం వార్డు సభ్యుడు కూడా కాదని, ఆయనకు ప్రొటోకాల్ ఇస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడికి వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారని కెటిఆర్ ఆరోపించారు.