
మౌనవేణువేదో అపురూప రాగాలను
తొలకరిస్తున్నట్టు
ఏ వెన్నెల పాలపుంతలనో పచ్చి పసుపూ
వెన్నముద్దతో కలగలిపి మైపూతగాఅలదుకున్నట్టు
ఉజ్వలప్రకాశమై అదృశ్య ఉనికి ఒకటి
అహరహం వెన్నంటి నీడలా పలకరిస్తూనే ఉంది
గాలి సన్నాయిలచిరుమేళవింపుల్లో
పాలరాతి సోపానాల మీద జారిపడే
సరిగమల్లో గమకాలుకుదించుకు
వేలాది వాయులీన తరంగాల్లో
తడిసి ముద్దైపోతూ మమేకమవుతూ
నక్షత్ర దీపాలు అలంకరించిన పసిడి పల్లకిలో
రేకులు రేకులుగా విప్పారే వెయ్యి రేకుల
బ్రహ్మకమలం -పొరలుపొరలుగా
తరలివచ్చే ఊహల మధుపాయీల గుంపు
అమృతహృదయాన్నిఅక్షరాలనిండా పొదిగి
విరబూసిన విరిబాలలను సుతారంగా అల్లిన
కవన మాలికలు ద్వార బందాలకు
వేళ్ళాడదీసిన ప్రదర్శన తుంచుకు
అలంకరించుకుందామనో కసికసిగా నలిపి
విసిరేద్దామనో ఎన్ని కాంక్షల కసాయి చూపులో
అందని ఆకాశాలను దింపితెచ్చి
ఎరుపెక్కిన చందమామ అరచేతిలో శిలువవేసి
చుక్కలను ఇంటి చుట్టూ కంచెగా
నాటుకున్న బృందావనం
పాటలు రాకపోతేనేంఏ అణువు కదలించినా
కాంభోజి రాగాలూ యమునా కల్యాణిలే
ఎన్ని ఉపద్రవాలు దండెత్తి వచ్చినా
ఎన్నెన్ని యుద్ధనౌకలు సముద్రాన మునిగినా
ఎంత మారణ కాండ శృతిమించి
విషాదం చిమ్మినా భస్స్మీపటలమైన మరు భూమిలో
కొత్త చిగురై మొలిచేది మెత్తని ప్రేమభావనే కదా
దిగులూ దుఃఖమూ వెంటపడి నీడల్లా
వెన్నాడుతున్న, సొంతఓదార్పే కొంత ఉపశమనం
రోజంతా వేడి వేడి గాలుల్లో వేగివేగి, కమిలి కందినా
సాయంత్రానికి చల్లని జలపాతమై
హరివిల్లు మెరుపుల్లో ఊహ సిద్ధమవుతుంది
సాయంత్రం దిగంతాల సెలయేటిలో దూకి
చల్లారిన వెలుగులరేడు వెన్నెల రాజైనింగి మెట్లెక్కి
చుక్కలతో చల్లదనం పంచుకు
రాత్రిని తాగి తూలినట్టు
పదమంజీరాలు రవళిస్తాయి.
- స్వాతి శ్రీపాద











