ముడిచమురు ఉత్పత్తి చేసే 12 దేశాల కూటమి (ఒపెక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్)లో సభ్యదేశంగా ఉత్పత్తి, సరఫరా తదితర వాణిజ్య కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ఆ కూటమినుంచి బయటపడడానికి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం మే 1 నుంచి అమలులోకి వస్తుంది. దీనివల్ల ముడిచమురు ధరలు ప్రపంచ మార్కెట్‌లో తగ్గే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం వెంటనే కనిపించకపోవచ్చు. 1960లో ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా ఈ ‘ఒపెక్’ను నెలకొల్పాయి. అల్జీరియా, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, గాబన్, ఇరాన్, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వెనిజులా తదితర దేశాలు ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నాయి.

ఈ దేశాలతోపాటు రష్యా వంటి ఇతర చమురు ఉత్పత్తి దేశాలు కలిస్తే దానిని ‘ఒపెక్ +’ అని పిలుస్తారు. ప్రపంచ మార్కెట్‌లో చమురు వాణిజ్యం 50 శాతం ఈ ఒపెక్ నియంత్రణలోనే ఉంటోంది. చమురు మార్కెట్‌లో ధరల స్థిరీకరణను కాపాడడం, సభ్యదేశాలకు స్థిరమైన ఆదాయం అందించడం ఈ ఒపెక్ లక్షం. ఒపెక్ కూటమిలో ఉంటున్నందున యుఎఇ చమురు ఉత్పత్తిపైన, సరఫరాపైన పరిమితులు భరించవలసి వస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం, ఇరాన్ దాడులతో తీవ్ర కష్టనష్టాలను ఎదుర్కోవలసి రావడం, యుఎఇని అల్లకల్లోలం చేస్తోంది. అందుకని ఒపెక్ కూటమి ఉక్కు పంజరంనుంచి బయటపడితేనే కానీ తమకు మేలు జరగదని వైదొలగడానికే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బయటకు రావడంవల్ల స్వేచ్ఛగా తమకు నచ్చినంత ఎక్కువగా చమురును ఉత్పత్తి చేసి సరఫరా చేసే అవకాశం కలుగుతుంది. రోజుకు ఐదు మిలియన్ బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేసే సామర్థం యుఎఇకి ఉన్నప్పటికీ ప్రస్తుతం 3.4 మిలియన్ బ్యారెళ్ల కన్నా ఎక్కువ ఉత్పత్తి చేయడానికి ఒపెక్ అవకాశం ఇవ్వడం లేదు.

ఇది న్యాయం కాదని యుఎఇ ఆందోళనతో ఉంటోంది. ఇక రాజకీయంగా చూస్తే ఇరాన్ తన పొరుగు దేశాలను ముఖ్యంగా యుఎఇ చమురు మౌలిక వనరులే లక్షంగా తరచుగా దాడులు సాగిస్తున్నా సభ్యదేశాలు కానీ, జిసిసి దేశాలు కానీ ప్రతిఘటించకపోవడం యుఎఇలో అసంతృప్తి కలిగిస్తోంది. ఇరాన్‌కు చెందిన ఆర్థిక సంస్థలపై ఆంక్షలు విధిస్తూ, ఇరాన్ అనుబంధ సంస్థల ఖాతాలను యుఎఇ స్తంభింప చేస్తోంది. ఈ పరిస్థితులవల్ల గల్ఫ్‌దేశాల మధ్య చీలిక తలెత్తింది. ఒకవైపు ఇరాన్‌తో సౌదీ అరేబియా ఖతార్ సయోధ్యగా ఉంటుండగా, ఇరాన్‌ను వ్యూహాత్మక ముప్పుగా యుఎఇ భావిస్తూ అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో చేతులు కలుపుతోంది. తరచుగా ఇరాన్ దాడులవల్ల గత రెండు నెలల్లో యుఎఇ విపరీతంగా నష్టపోయింది. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి భారీ స్థాయిలో చమురును ఉత్పత్తి, సరఫరా చేయడమే తరుణోపాయంగా యుఎఇ భావిస్తోంది. ఒపెక్స్+ లో సభ్యదేశాల తీరు కూడా అస్తవ్యస్తంగా ఉంటోంది. సభ్యదేశాల తరఫున సౌదీ అరేబియా భారీగా ఉత్పత్తి కోతలను భరిస్తున్నప్పటికీ, మిగిలిన దేశాలు ‘ఫ్రీ రైడింగ్’ (అధిక ఆదాయం కోసం నిబంధనలు పాటించకపోవడం) చేస్తుండడంతో ఒపెక్స్+ కూటమిలో చీలికలు వస్తున్నాయి.

ఒపెక్స్ సభ్యదేశాలు తమ ఉత్పత్తి కోటాలను పాటించకపోవడం వల్ల చమురు ధరలను నియంత్రించే సామర్థం ఈ మధ్యకాలంలో తగ్గుతోంది. 2024 25 మధ్యకాలంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా కనిపించింది. అలాగే ఒపెక్స్+ కూటమిలోని సభ్యదేశాలైన అమెరికా, బ్రెజిల్, గయానా వంటి దేశాల్లో చమురు ఉత్పత్తిని పెంచడంతో ప్రపంచ మార్కెట్‌లో సరఫరా పెరిగి, డిమాండ్ కన్నా ఎక్కువగా నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ పరిస్థితులన్నిటినీ అధ్యయనం చేసి యుఎఇ ఒపెక్‌నుంచి బయటపడితేనే తమ మనుగడ బాగుంటుందన్న నిర్ణయం తీసుకుంది. ఒపెక్‌లో సభ్యులుగా ఉన్న దేశాల్లో మరికొన్ని యుఎఇ విధంగానే బయటపడాలని యోచిస్తున్నాయి. ఇవన్నీ జరిగితే చమురు ఉత్పత్తి బాగా పెరిగి, ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు డిమాండ్ బాగా తగ్గి ధరలు బ్యారెల్‌కు 50 డాలర్ల నుంచి 60 డాలర్ల వరకు తగ్గుతాయని అంచనా. ముడి చమురు వినియోగంలో 85 శాతం దిగుమతులపై ఆధారపడుతున్న భారత్‌కు యుఎఇ వల్ల ప్రయోజనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

భారత్‌కు ముడి చమురు ప్రధాన సరఫరాదారుల్లో యుఎఇ ఒకటి. చమురు అధికశాతం సాధించుకోవడానికి యుఎఇ తో భారత్ సుదీర్ఘకాల ఒప్పందం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. యుఎఇ కూడా హర్మూజ్ జలసంధి అవసరం లేకుండా తన పైపులైన్ ద్వారానే ముడి చమురును సరఫరా చేయాలనే ఆలోచనలో ఉంది. అయితే ప్రస్తుతం హర్మూజ్ జలసంధి దిగ్బంధనం తొలగితేనే కానీ సరైన మార్గం లభించదు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరి పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తొలగిపోతేకానీ చమురు ఉత్పత్తి, విక్రయాలు సరిగ్గా సాగవు. ఒప్పందం కుదిరిన తరువాత ఇరాన్ చమురును స్వేచ్ఛగా అమ్ముకోనిస్తే దిగుమతిదారులకు ఊరట లభిస్తుంది. చమురు ధరలు తగ్గుతాయి. ఇరాన్ ప్రతిపాదనలను అమెరికా అంగీకరించడం లేదు. ఇరాన్‌పై సైనిక చర్యకు మళ్లీ పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు రష్యా హెచ్చరించింది. రెండు దేశాలు వెనక్కు తగ్గితేనే హర్మూజ్ జలసంధి రవాణా యథా ప్రకారం సాగుతుంది. అంతవరకు యుఎఇ ఒపెక్ నుంచి బయటకు వచ్చినా ఫలితం, ప్రయోజనాలు ఎవరికీ అందవు.