తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఓరుగల్లుకు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ మలివిడత ఉద్యమం కెసిఆర్ ఆధ్వర్యంలో ఆరంభమైన తరువాత ఓరుగల్లు తెలంగాణ భావజాల వ్యాప్తికి క్రియాశీలకంగా మారింది. ఓరుగల్లు ఉద్యమ పిడికిలి ఎత్తి గర్జిస్తే ఆనాటి తెలంగాణ పదిజిల్లాలో చైతన్యం నిండుకున్నది. తెలంగాణ మలివిడత ఉద్యమంలో కెసిఆర్‌తో నడిచిన ఉద్యమకారులలో ఓరుగల్లు స్థానం గొప్పది. అనేక ఉద్యమాలకు వరంగల్ వేదికగా నిలిచింది. అటువంటి వేదికలను సమర్థవంతంగా నిర్వహించి తెలంగాణ మలివిడత ఉద్యమంలో వరంగల్‌లో గొప్ప గర్జనగా నర్సంపేట మాజీ ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్‌రెడ్డి నిలిచారు. కెసిఆర్ ప్రారంభించిన ఉద్యమంలో మడమ తిప్పకుండా విశేష కృషి చేశారు. తెలంగాణ మలివిడత ఉద్యమంలో వరంగల్ వేదిక అనేక సభలకు వేదిక అయింది. అటువంటి వేదికల గర్జన వెనుక పెద్ది సుదర్శన్‌రెడ్డి విశేష కృషి ఉంది. తెలంగాణ ప్రాంతం ఏర్పాటు ఆకాంక్షనే ధ్యేయంగా కృషి చేసిన నాయకుడు. ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి నేడు తెలంగాణ అంతా తల్లడిల్లుతూ ఆయనపై అభిమానాన్ని చాటుకుంది.

తెలంగాణ ఉద్యమంలో మడమతిప్పని నాయకుడు.. ఓ దశలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నెరవేరే వరకూ వ్యక్తిగత జీవితానికి పెళ్లి చేసుకోకుండా నిబద్ధతగా పని చేశారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ వెన్నంటి ఉంటూ వచ్చారు. తెలంగాణ ఉద్యమం 2001లో ప్రారంభం నుంచి మొదలుకొని ఆయన ఏనాడు వెనక్కి తగ్గలేదు. సాధారణ కార్యకర్తగా గులాబీ పార్టీలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి తెలంగాణ ఆకాంక్షనే ఆశయంగా కృషి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేయడంలో ఆయన విశేష కృషి ఉన్నది. అధినేత కెసిఆర్‌కు ఉద్యమ కష్టకాలంలో ఉన్న కొద్దిమందిలో పెద్ది సుదర్శన్‌రెడ్డి ఒకరు. రాజకీయ అవకాశాలు రాకపోయినా.. ఓటములు ఎదురైనా ఆయన ఉద్యమంలో ఏనాడు ఆయన పాత్ర తగ్గలేదు.

నర్సంపేట నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తూనే .. 2004 రైతు నాగలి గుర్తుపై జరిగిన ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికల్లో భాగంగా ఆనాడు జడ్‌పిటిసిగా గెలిచి జడ్‌పి ఫ్లోర్‌లీడర్‌గా కృషి చేశారు. అనంతరం పార్టీ ఉద్యమ విస్తృత నేపథ్యంలో వరంగల్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా సుమారు 8ఏళ్ల పాటు పని చేశారు. గులాబీ జెండా భుజానవేసుకొని నడిచింది మొదలు ఆయన ఎటువంటి రాజకీయ అవకాశాల కోసం పార్టీ మారలేదు. నమ్మిన నాయకుని కోసం.. తెలంగాణ ప్రజల ఆకాంక్షకోసం పోరులో ఆయన కెసిఆర్‌కు అత్యంత సాన్నిహిత్యంగా ఉంటూ చురుకుగా పాల్గొన్నారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్‌గా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఎంఎల్‌ఎగా పోటీ చేసి ఓటమి చెందితే అధినేత కెసిఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డికి తెలంగాణ పౌరసరఫరాల సంస్థకు చైర్మన్‌గా నియమించారు. అయినా ఆయన ఎటువంటి నైరాశ్యానికి గురికాకుండా అధినేత కెసిఆర్ సూచనతో పార్టీకి అత్యంత నిబద్ధ్దతునిగా కృషి చేస్తూ వస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఓ దళిత సామాజిక వర్గానికి చెందిన బిడ్డను పెళ్లి చేసుకోవడం ఆయన సామాజిక భావజాలాలకు అద్దం పట్టేలా ఉంది. కాగా 2018లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఎంఎల్‌ఎగా గెలుపొందారు. కాగా అదే సమయంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ది సుదర్శన్‌రెడ్డి భార్య స్వప్న జడ్‌పిటిసి గా గెలిచి ప్రజాజీవితంలో ఇరువురు కృషి చేశారు. 2023 ఎన్నికల్లో ఎంఎల్‌ఎగా ఓడిపోయినా పెద్ది సుదర్శన్‌రెడ్డి మాత్రం నర్సంపేట నియోజకవర్గంలో ప్రజలకోసం కృషి చేస్తూ వచ్చారు. ఇటీవల తనకు ఎంఎల్‌ఎగా వచ్చే పింఛన్ డబ్బులను కూడా రోడ్డు సౌకర్యం కోసం ఇస్తున్నట్లు ప్రకటించి ఆయన సేవా గుణాన్ని చాటుకున్నారు.

తెలంగాణ ఉద్యమకారుడు, కెసిఆర్‌కు అత్యంత సాన్నిహిత్యంగా ఉంటూ విశేష కృషి చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం బిఆర్‌ఎస్ శ్రేణులు అడుగడుగునా నిలబడ్డారు. తెలంగాణ వచ్చే వరకూ వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి.. పోరాటంలో ముందుండి.. సామాజిక విలువలతో ఓ దళిత వర్గానికి చెందిన బిడ్డను ఆదర్శ వివాహం చేసుకొని పెద్ది సుదర్శన్‌రెడ్డి గొప్ప మనసును చాటుకున్నారు. ఉద్యమ నాయకుని కోసం బిఆర్‌ఎస్ శ్రేణుల తపన నిజంగా గొప్పగా నిలిచి .. పెద్దికి తెలంగాణ బలగం అంతా కొండంత అండగా నిలిచింది. అయినా కాలం పంజా విసిరి విరోచిత పోరాట యోధుడిని భౌతికంగా దూరం చేసింది. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎటువంటి రాజకీయ గర్వం లేని నాయకుడు.. సాధారణ కార్యకర్తగా, అసాధారణ వ్యక్తిత్వంతో తెలంగాణ ఉద్యమకారుల, ప్రజల గుండెల్లో చెరగని ముద్రను వారు వేసుకున్నారు. ఓరుగల్లు ఉద్యమ గర్జనలో పెద్ది సుదర్శన్‌రెడ్డి త్యాగం ఎప్పటికీ భవిష్యత్తు తరాలు మరిచిపోని చరిత్రగా సాక్ష్యంగా నిలుస్తది..

- సంపత్ గడ్డం

78933 03516