
మన తెలంగాణ/హైదరాబాద్‌ః ఓట్ చోరీ వల్లే గతంలో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఓడిపోయానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆవేదన చెందారు. ఇప్పుడు జరుగుతున్న ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందో లేదో జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. ఓట్ల తారు-మారు వల్లే తాను ఎంపీగా ఓడిపోయానని, తాను కూడా ఓట్ చోరీ బాధితుడినే ఆయన తెలిపారు.
బిఆర్‌ఎస్ నేతలు కావాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్ నేతలు అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. పోన్లు ట్యాప్ చేసిన వారే ఇప్పుడు ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడుతున్నా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నదని ఆయన విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతు భరోసా, పేదలకు రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం, ఇంకా సన్న బియ్యం పండించే రైతులకు క్వింటాల్‌కు ఐదు వందల రూపాయల బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.
తండ్రిని విమర్శించడం బాధాకరం..
కవిత తన తండ్రి కెసిఆర్‌ను విమర్శించడం బాధాకరమని అన్నారు. కెసిఆర్‌ను ఆమె నిరాశ, నిస్పృహలకు గురి చేస్తున్నారని దానం విమర్శించారు. తల్లిదండ్రులను గౌరవించని వారు ఏమి మనుషులని ఆయన దుయ్యబట్టారు.









