
ఆర్‌జి కర్ ఘటన, సందేశ్ ఖలీ అమానుషాలతో జనంలో పలచన
నేతల అవినీతి, నిరుద్యోగ యువతలో నైరాశ్యం
సర్‌తో టిఎంసి మరింత చతికిల
బిజెపికి కలిసి వచ్చిన ప్రభుత్వంపై సహజ వ్యతిరేకత
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అప్రతిహతంగా మూడు పర్యాయాలు ఏలిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. 15 ఏళ్ల తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసిని అధికారం నుంచి భారతీయ జనతా పార్టీ ఎట్టకేలకు గద్దె దించగలిగింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటి అగ్ర నాయకుల ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపించిన ఈ కాషాయ పార్టీ, అత్యధిక కాలం వామపక్ష రాజకీయాల ఆధిపత్యం కొనసాగిన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ క్రమంలో ప్రజల్లో ఇంతగా ఆదరణ కోల్పోవడానికి మమతా బెనర్జీ చేసిన తప్పులే ఆమె పార్టీ మెడకు చుట్టుకున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఓటమికి తానే స్వయంగా దారులు పరుచుకున్నరాని పేర్కొంటున్నారు.
ఆర్‌జి కర్ ఘటన నుంచి మొదలు పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి పతనానికి నాంది పడింది. ఒక యువ వైద్యురాలిపై జరిగిన అమానుష ఘటన, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ముఖ్యంగా మహిళా భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందన్న భావన ప్రజల్లో నాటుకుపోయింది. బాధిత వైద్యురాలి తల్లి స్వయంగా ఎన్నికల బరిలోకి దిగడం టిఎంసికి రాజకీయంగా పెద్ద దెబ్బ తగిలింది. మరోవైపు నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో జరిగిన కుంభకోణాలు యువతను టిఎంసికి దూరం చేశాయి. సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన వేధింపుల ఆరోపణలు, స్థానిక నేతల అరాచకాలు టిఎంసి ప్రతిష్టను దెబ్బ తీశాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం మహిళా ఓటర్లు పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి ఇది ఒక ముఖ్య కారణం.
ఈసీ చర్యలతో ఝలక్..
ఓటర్ల సమగ్ర సవరణ పేరిట ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ప్రక్షాళనలో భాగంగా సుమారు 89 లక్షల మంది ఓటర్లను పశ్చిమ బెంగాల్ జాబితా నుంచి తొలగించడం టిఎంసికి ప్రతికూలంగా మారింది. ఈ తొలగింపులపై మమతా బెనర్జీ తీవ్ర నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వీటికి వరుసగా మూడుసార్లు అధికారంలో ఉండటంతో ప్రజల్లో కూడా సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. అది ఈసారి బలంగా పనిచేసింది.












