కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో శనివారం కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. తొలిసారి ఆ రాష్ట్రంలో బిజెపి సర్కార్‌ను ఏర్పాటు చేసింది. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే మాజీ సిఎం మమతా బెనర్జీ ఈ నేపథ్యంలో తన ఓటమిని అంగీకరించారు. ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని మమతా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తన సిఎం పదవికి రాజీనామా చేయనని తేల్చి చెప్పేశారు.

అయితే మే 7వ తేదీతో అసెంబ్లీ గడువు ముగియడంతో గవర్నర్ దానిని రద్దు చేశారు. తాజాగా బిజెపి నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో దీదీ తన ఓటమిని అంగీకరిస్తూ.. ఎక్స్ ఖాతాలో బయోను మార్చేశారు. ‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక ఛైర్‌పర్సన్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి(15వ, 16వ, 17వ విధాన్‌సభ)’గా ఆమె తన బయోని అప్‌డేట్ చేశారు. అంతకు ముందు అక్కడ ‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి’ అని మాత్రమే ఉండేది.