
నేడే ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్న ఎన్నికల సంఘం
ఓటర్లలో టెన్షన్ టెన్షన్
2.64 కోట్లమంది వివరాలతో జాబితా రెడీ
అభ్యంతరాలు, మార్పులు, చేర్పులకు సెప్టెంబర్ 16 వరకు అవకాశం
అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా
రాష్ట్రంలో కీలక దశకు ‘సర్’ ప్రక్రియ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం కీలక దశకు చేరుకుంది. ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగియటంతో సోమవారం (ఆగస్టు 17) కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ముసాయిదా ఓ టరు జాబితాను విడుదల చేయనుంది. సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలు నింపి బూత్ స్థాయి అధికారులకు (బిఎల్‌ఒ) అందజేసినప్పటికీ ముసాయిదా ఓటరు జాబితాలో తమ పే రు ఉంటుందా..? ఉండదా..? అని ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో మొ త్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, అం దులో 2,64,87,214 (78.30 శాతం) ఓట్లు న మోదైనట్లు కమిషన్ వెల్లడించింది.
తెలంగాణలో 73,39,234 (21.70శాతం) ఓట్లు తగ్గాయి. 9,22,230 మంది మరణించినట్లు గుర్తించారు. 11,25,546 ఓటర్లు అందుబాటులో లేరు. ఇతర ప్రాంతాలకు 45,18,961 ఓటర్లు బదిలీ అయ్యా రు. మరోచోట 6,70,203 మంది ఓటు హక్కు క లిగి ఉన్నారు. ఇతర కారణాలతో 1,02,294 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ తిరిగి వెనక్కి తీసుకునేందుకు వీలు లే ని ఫారాలను అన్‌కలెక్టబుల్ వాటిగా పరిగణిస్తా రు. ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు అందించామని, వాటిలో కొన్ని పత్రాలు సేకరించేందుకు వీ లు లేకుండా ఉండటంతో వాటిని అన్‌కలెక్టబుల్‌గా నిర్ధారిస్తున్నట్లు అధికారులు గణాంకాలతో చూపిస్తున్నట్లు తెలిసింది.
78.30 శాతం డిజిటలైజేషన్
రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, 78.30 శాతం మంది ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. మిగిలిన ఓట్లను అన్‌కలెక్టబుల్ ఓటర్లుగా గుర్తించి వందశాతం డిజిటైజేషన్ పూర్తిచేశారు. వీరిలో మరణించినవారు, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు, డబుల్ ఎంట్రీ ఉన్నవారు, ఆబ్సెంట్ అయినవారు, ఇతరత్రా కారణాలతో అందుబాటులో లేనివారిగా వీరిని పరిగణించారు.అయితే, రాష్ట్రంలో ఓటర్లకు వంద శాతం ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేసినట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
క్షేత్రస్థాయిలో ముమ్మర పరిశీలన
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలన జరిపారు. జూన్ 25 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ ప్రారంభం కాగా, ఈనెల 10 వరకు ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ గడువు ముగిసింది. బిఎల్‌ఒలు ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేసి, ఓటర్ల వివరాలతో నింపిన ఆ పత్రాలను తిరిగి సేకరించారు. ఆ తర్వాత ఆ వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో డిజిటలైజేషన్ చేశారు. బిఎల్‌ఒలు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు పలు వాస్తవాలు వెలుగుచూశాయి. ఇచ్చిన చిరునామాల్లో చాలా మంది ఓటర్లు లేరని గుర్తించారు.
మరికొందరి చిరునామా లభ్యం కాలేదు. శాశ్వతంగా వలస వెళ్లిన వారు, చనిపోయిన వారి పేర్లను గుర్తించారు. ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉన్న వాటిని ఏరివేశారు. వీరందరినీ అన్‌కలెక్టబుల్ జాబితాలో ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ (ఎఎస్‌డి) జాబితాలో చేర్చారు. దీంతో ఈ పేర్లు ముసాయిదా జాబితాలో ఉండవు. ఈ కేటగిరీలో మరణించినవారు 9,22,230 మంది, శాశ్వతంగా వలస వెళ్లినవారు 45,18,961 ఓటర్లు ఉన్నారు. అందుబాటులో లేని ఓటర్లు 11,25,546 మంది ఉండగా, మరోచోట 6,70,203 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు.
ఇతర కారణాలతో 1,02,294 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ కాలేదు. ఎఎస్‌డిడి ఓట్లలో వలస వెళ్లిన ఓటర్లనే అధికంగా గుర్తించారు. 45,18,961 ఓటర్లు వలస వెళ్లినట్లు నమోదు అయ్యింది. స్థానికంగా బిఎల్‌ఒలు ఓటర్ల ఇంటికి వెళ్లినప్పుడూ వారు అక్కడ ఉండడం లేదని, పూర్తిగా వేరే ప్రాంతానికి వెళ్లిపోయినట్లు తమ దృష్టికి వచ్చినట్లు సిబ్బంది చెప్పారు. కొంతమంది ఓటర్లు చిరునామాలో లేకపోవడం, మృతి చెందడం వంటి అంశాలను గుర్తించారు. ఎఎస్‌డి పేరిట విడిగా తయారు చేసిన ఈ జాబితాను రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లకు అందజేయనున్నారు.
అక్టోబరు 19న తుది ఓటర్ల జాబితా
తొలగించిన ఓట్లు మినహాయించి మిగిలిన వారితో ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను సిద్ధం చేసింది. మొత్తం 2,64,87,214 మంది ఓటర్ల వివరాలతో ఈ ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. ఈ ముసాయిదా, ఎఎస్‌డి జాబితాల్లోని వివరాలపై అభ్యంతరాలు తెలిపేందుకు ఇసి అవకాశం కల్పించింది. సోమవారం ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా విడుదల చేసి, ఆ రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్ 15 వరకు అభ్యంతరాలను పరిశీలిస్తారు. ఈ సమయంలో నోటీసులు, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ నిర్వహిస్తారు. అర్హతలు ఉన్నట్లు తేలితే తుది జాబితాలో వారి పేరును కచ్చితంగా చేరుస్తారు. అనర్హులుగా తేలితే మాత్రం ఓటును తొలగిస్తారు. విచారణ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత అక్టోబరు 19న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురిస్తారు.











