పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని ఉద్యమిస్తున్న నిరసనకారులపై పాకిస్థాన్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో గత 24 గంటల్లో 20 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. రావల్‌కోట్‌లోని డ్రేక్ ఎయిత్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) కార్యకర్తలపై భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో జేఏఏసీ ప్రధాన కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి ఉమర్ నజీర్ కశ్మీరీ సోదరుడు ఉస్మాన్ నజీర్ కూడా మృతిచెందినట్లు సమాచారం.జూన్ 5 నుంచి పీవోకేలో ఎన్నికల వ్యతిరేక ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి పాకిస్థాన్ భద్రతా బలగాల చర్యల్లో ఇప్పటివరకు సుమారు 80 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక వర్గాలు పేర్కొన్నాయి.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోల్లో నిరసనకారుల మృతదేహాలు రహదారులపై కనిపిస్తుండగా, గుంపులపై భద్రతా బలగాలు కాల్పులు జరుపుతున్న దృశ్యాలు ఉన్నట్లు తెలుస్తోంది.పీవోకేకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అఖీల్ భాయ్ విడుదల చేసిన వీడియో సందేశంలో, రావల్‌కోట్ మృతదేహాలు, క్షతగాత్రులతో నిండిపోయింది. వెంటనే మాకు అండగా నిలవండి అని అంతర్జాతీయ సమాజాన్ని వేడుకున్నారు. ఎన్నో మృతదేహాలను మోసి మా భుజాలు అలసిపోయాయి. మేము శాంతియుతంగా నిరసనలు చేస్తున్న ప్రజలం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల బహిష్కరణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) సభ్యులనే ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని భద్రతా బలగాలు చర్యలు చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీవోకేలో ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఇస్లామాబాద్ ప్రభుత్వం 14 వేల మందికిపైగా సాయుధ భద్రతా సిబ్బందిని మోహరించింది. పలు ప్రాంతాల్లో స్నైపర్లను కూడా నియమించినట్లు సమాచారం.

నిరసనకారులను చెదరగొట్టేందుకు ప్రత్యక్ష బుల్లెట్లు, దీర్ఘ శ్రేణి టియర్‌గ్యాస్ షెల్‌లను ఉపయోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.ఐఏఎన్‌ఎస్ కథనం ప్రకారం, ఎన్నికలను బహిష్కరిస్తున్న వారిపై అవసరమైతే కాల్పులు జరపాలని భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. పీవోకేలో పలు వారాలుగా కొనసాగుతున్న నిరసనలను అణచివేయడమే ఈ చర్యల ఉద్దేశమని పేర్కొంది. ఇక బలప్రయోగంతో పాటు పీవోకేలో ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేయడంతో పాటు పలు ప్రాంతాల్లో విద్యుత్, తాగునీటి సరఫరాను కూడా నిలిపివేసినట్లు సమాచారం.

మూడు దశల్లో పీవోకే ఎన్నికలు

పీవోకే శాసనసభలో మొత్తం 53 స్థానాలు ఉండగా, వాటిలో 45 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మిగిలిన ఎనిమిది స్థానాలను మహిళలు, సాంకేతిక నిపుణులు, మతపెద్దలకు రిజర్వ్ చేశారు. 45 స్థానాలకు ఎన్నికలను మూడు దశల్లో నిర్వహిస్తున్నారు. తొలి దశలో మీర్‌పూర్ డివిజన్‌లోని 13 నియోజకవర్గాలకు జూలై 27న పోలింగ్ జరిగింది. రెండో దశలో ముజఫరాబాద్ డివిజన్‌లోని తొమ్మిది నియోజకవర్గాలతో పాటు 12 శరణార్థి నియోజకవర్గాలకు ఆగస్టు 2న ఎన్నికలు జరగనున్నాయి. చివరి దశలో పూంచ్ డివిజన్‌లోని 11 నియోజకవర్గాలకు ఆగస్టు 10న పోలింగ్ నిర్వహించనున్నారు.