
అమెరికా ఇరాన్ మధ్య పాకిస్థాన్‌లో చర్చలు విచిత్ర ఉత్కంఠ స్థితికి చేరాయి. ఒక్కరోజు క్రితమే ఇస్లామాబాద్‌కు వచ్చిన ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రత్యేక దూతలను కలువకుండానే శనివారం తిరిగి వెళ్లింది.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి సారధ్యంలో పాకిస్థాన్‌కు వచ్చిన ఇరాన్ బృందం ఇక్కడ ఉన్నత స్థాయి చర్చలు జరిపింది. పాక్‌కు చెందిన అత్యున్నత స్థాయి ప్రభుత్వ ప్రతినిధులతో, సైనికాధికారులతో విస్తృత చర్చలు జరిపింది. మూడు దేశాల పర్యటనకు వచ్చిన తాము ముందుగా పాకిస్థాన్‌కు వచ్చినట్లు ప్రకటించారు. ఈ దశలోనే ట్రంప్ దూతలతో కూడిన అమెరికా బృందం పాకిస్థాన్‌కు చేరుకుంటుందని, ఇరుదేశాల మధ్య నేరుగా చర్చలు ఉంటాయని తొలుత భావించారు. అయితే అరాగ్చి బృందం అమెరికా టీం వచ్చే దాకా పాకిస్థాన్‌లో ఉండకుండానే వెళ్లిపోయింది. తాము పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను , సైనిక ప్రధానాధికారి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌ను ఇతర అధికారులను కలిసినట్లు అరాగ్చి తెలిపారని వెల్లడైంది.
అయితే ఏ విషయాలపై చర్చలు జరిగాయనేది వెలుగులోకి రాలేదు. ఇక శనివారం రాత్రి ఎప్పటికైనా అమెరికా బృందం ఇస్లామాబాద్‌కు చేరుకోవల్సి ఉంది. ఇప్పుడు ఇరాన్ బృందం ఇక్కడి నుంచి వెళ్లిపోవడంతో ట్రంప్ బృందం పాకిస్థాన్‌కు వస్తుందా రాదా అనేది తేలడం లేదు. ఈ బృందం పాకిస్థాన్ పర్యటనపై మాట్లాడేందుకు వైట్‌హౌస్ అధికార వర్గాలు శనివారం నిరాకరించాయి. ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్టులో ఇరాన్ ప్రతినిధి బృందానికి వీడ్కోలు పలికేందుకు పాక్ సీనియర్ అధికారులు తరలివచ్చారు. వారు ఏ విషయం గురించి మీడియాకు చెప్పలేదు. అయితే ఇరాన్ ఉన్నత స్థాయి బృందం ఇక్కడికి వచ్చి పలు కీలక విషయాలపై మాట్లాడి వెళ్లడం మలుపు తిప్పే పరిణామం అని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రాంతీయ స్థాయి విషయాలు, ఇప్పటి ఉద్రిక్తతలు, అమెరికాతో సాగుతున్న చర్చలు , మరో వైపు కవ్వింపు చర్యల విషయాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపారు. ఇరాన్ విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌లో చర్చలకు వచ్చిన విషయాన్ని ఇస్లామాబాద్‌లోనిఇరాన్ ఎంబసీ వర్గాలు ధృవీకరించాయి. అయితే చర్చల వివరాలు తెలియచేయలేదు.
అయితే సమావేశం గురించి తెలిపే సంక్షిప్త వీడియోను ప్రకటనతో పాటు జతపర్చారు. ఇరాన్ ప్రతినిధి బృందంలో విదేశాంగ శాఖ ఉప మంత్రి కజీం ఘారిబబాది, అదికార ప్రతినిధి ఎస్మాయిల్ బఘెయి, పాక్‌లో ఇరాన్ రాయబారి రెజా అమిరి మెఘాదమ్ కూడా ఉన్నారు. పాకిస్థాన్ వైపు నుంచి అంతర్గత వ్యవహారాల మంత్రి మెహిసిన్ నక్వీ ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రత్యేకించి అరాగ్చి ఇక్కడ సైనిక చీప్ మునీర్‌తో చాలా సేపు మాట్లాడారు. అమెరికాతో శాంతి చర్చల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి సమీక్షించినట్లు వెల్లడైంది. ఇరాన్ బృందం పాకిస్థాన్ ప్రధాని షరీఫ్‌తో చర్చల దశలో పలు ద్వైపాక్షిక విషయాలు, ప్రాంతీయ క్లిష్ట సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. పాక్ ప్రధానితో చర్చల సందర్భంగా మునీర్‌తో పాటు ఉప ప్రధాని ఇషాఖ్ డార్ కూడా ఉన్నారు. అమెరికా బృందం రాకకోసం వేచి చూడకుండానే తాము తిరిగి వెళ్లుతామని ఇరాన్ బృందం ముందుగానే ప్రకటిచింది. దీనితో ప్రస్తుత దశలో ఇరాన్ అమెరికా మధ్య నేరుగా రెండో దఫా చర్చలకు అవకాశం లేదని స్పష్టం అయింది. అమెరికాతో చర్చల విషయంలో ఇరాన్ వైఖరి అంతా ఇప్పుడు పాకిస్థాన్‌కు తెలియచేయడం జరిగింది. ఇక పాకిస్థాన్ తరఫున అమెరికా బృందానికి ఇరాన్ వైఖరి ఏమిటనేది పాక్ ద్వారానే తెలుస్తుందని శనివారం రాత్రి ఓ సీనియర్ అధికారి తెలిపారు.












