
కరాచీ : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఓ రైలులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 24 మంది దుర్మరణం చెందారు. ఆదివారం ఉదయం క్వెట్టా ప్రాంతంలోని చమన్ పాటక్ రైల్వే స్టేషన్ వద్ద ఈ దారుణం జరిగింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌కు అనుబంధంగా మారుమూల ప్రాంతంలో వెళ్లే షటిల్ సర్వీసు రైలులో ఈ పేలుడు జరిగింది. నిషేధిత బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్‌ఎ) ఈ పేలుడుకు తమదే బాద్యత అని ప్రకటించింది, షటిల్ రైలు క్వెట్టా కంటోన్మెంట్ నుంచి బయలుదేరిన రైలు దాడికి గురైందని స్థానిక అధికారులు తెలిపారు. కంట్మోనెంట్ నుంచి సైనికులను తీసుకువెళ్లుతున్నందునే తాము దీనిని లక్షంగా చేసుకుని దాడికి దిగినట్లు బిఎల్‌ఎ తెలిపింది.
14 మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. ఇందులో ముగ్గురు ఫ్రాంటియర్ కార్ప్ సిబ్బంది కి చెందిన వారు. అయితే మృతుల సంఖ్య 20కు చేరిందని, పలువురు గాయపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే మృతుల సంఖ్య అత్యధికంగా ఉందని అక్కడి సోషల్ మీడియా వర్గాలు తెలియచేస్తున్నాయి. సైనికులు, వారి కుటుంబాలతో కలిసి వెళ్లుతున్న ఈ రైలును టార్గెట్ చేసుకుని రైల్వే సిగ్నల్ దాటుతున్న సమయంలోనే పేలుడు పదార్థాల ట్రక్కు ఒకటి వచ్చి రైలును ఢీకొంది. దీనితో పేలుడు సంభవించి , ఓ బోగీ తగులబడినట్లు వెల్లడైంది. మృతుల్లో ఎక్కువ మంది సైనికులు, వారి కుటుంబ సభ్యులే ఉన్నారని స్థానికులు తెలిపారు. ఈ సంఘటన గురించి తెలియగానే ప్రజటు అక్కడికి తరలివచ్చారు. వీరిని నివారించేందుకు స్థానిక పోలీసు, రైల్వే పోలీసు బలగాలు శ్రమించాల్సి వచ్చింది.
ఘటన గురించి పాకిసస్థాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసీ స్పందించారు. పేలుడులో సామాన్య ప్రయాణికులు బాధితులు అయ్యారని తెలిపారు. మూడు బోగీలు ధ్వంసం అయ్యాయని ప్రకటించారు. మరో వైపు బలోచ్ సైనిక ప్రతినిధి జీయాంద్ బలోచ్ తమది ప్రతీకార చర్య అని తెలిపారు. పాకిస్థాన్ పాలకులు తమ బలోచ్‌లను అణచివేస్తున్నారని, సైన్యాన్ని పంపించి వేధిస్తున్నారని , తమ సంస్కృతి, హక్కుల రక్షణకు తాము తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఇటువంటి దాడులకు దిగుతూనే ఉంటామని ప్రకటించారు. బలోచ్ గెరిల్లా సైన్యం బలోపేతం అయిందని, ఇందులో మహిళలు కూడా పోరుకు సిద్ధంగా ఉన్నారని చెపుతూ ఓ వీడియో వెలువరించారు. బలోచ్ మహిళ షైనాజ్ బలోచ్ ఇందులో మాట్లాడుతూ అణచివేతకు గురవుతున్న ప్రతి బిడ్డ విముక్తి కోసం ప్రాణత్యాగానికి వెనుకాడబోడని తెలిపింది.











