
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన చోదకశక్తులుగా నిలిచాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే దశాబ్దాలుగా తీరని పాలమూరు దాహార్తి తీరుతుందని, వలసల జిల్లా అనే ముద్ర శాశ్వతంగా చెరిగిపోతుందని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు కోటిఆశలతో ఎదురుచూశారు. కానీ, స్వరాష్ట్రం సిద్ధించి పన్నెండేళ్లు గడిచినా ఉమ్మడి పాలమూరు పరిస్థితి ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’ అన్న చందంగానే ఉంది. తెలంగాణ సిద్ధించిన తర్వాత పాలకులు మారినా, పార్టీలు మారినా, మహబూబ్‌నగర్ జిల్లాపట్ల ప్రదర్శిస్తున్న అలసత్వం మాత్రం మారలేదు. జూరాల, భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి, ప్రతిష్టాత్మక పాలమూరు- రంగారెడ్డి వంటి ఎత్తిపోతల పథకాలు నేటికీ అరకొర పనులతో, అసంపూర్తి నిర్మాణాలతో వెక్కిరిస్తూనే ఉన్నాయి. ఫలితంగా పచ్చని పొలాలుగా మారాల్సిన పాలమూరు నేలలు నేటికీ ఎండిపోతూనే ఉన్నాయి.
బతుకుదెరువుకోసం గ్రామాలు ఖాళీచేసి దుబాయ్, ముంబై, హైదరాబాద్‌లకు పొట్టచేతపట్టుకుని వలసవెళ్లే రైతులు, కూలీల గుండెకోతలింకా ఆగిపోలేదు. నీటి పారుదల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడం, స్పష్టమైన ప్రణాళికలు లేకపోవడం జిల్లా ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది. ఉమ్మడి రాష్ట్ర కాలంలోనే సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సాధించుకున్న 72 జిఒ అమలును పాలకులు విస్మరించడం శోచనీయం. కృష్ణ, భీమా నదుల సంగమ ప్రాంతంలోని అనువైన స్థలం నుంచి రోజుకు ఐదు టిఎంసిల నీటిని లిఫ్ట్ చేసే విధంగా నూతన పథకానికి శ్రీకారం చుట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పనులు, దానికి సంబంధించిన కాలువలు, పంప్ హౌస్‌ల నిర్మాణాలను వెంటనే చేపట్టి పూర్తి చేయాలి. దిండి లిఫ్ట్ కాలువ పేరుతో పాలమూరు -రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలి.
నల్లగొండ జిల్లాకు అవసరమైన సాగు, తాగునీటిని నాగార్జునసాగర్- గొట్టిముక్కల లిఫ్ట్ ద్వారా సమకూర్చవచ్చనే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, పాలమూరు హక్కులను హరించేలా వ్యూహాలు రచించడం సమంజసం కాదు. దీనికితోడు ఉల్ఫరా బ్యారేజ్, గోకారం, గొల్లపల్లి, చీరకపల్లి బ్యారేజీ రిజర్వాయర్ల నిర్మాణ ప్రతిపాదనలను నిలిపివేసి, మొదట ప్రారంభించిన ప్రాజెక్టులను కొలిక్కి తీసుకురావడంపై దృష్టి సారించాలి. పాలమూరు దాహార్తిని తీర్చే కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, వాటికి నికరజలాలను సాధించాలి. మూడేళ్లలోనే పూర్తి చేస్తామంటూ 105 జిఒతో 2015లో అత్యంత ఆర్భాటంగా పనులు ప్రారంభించిన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పదేళ్లు దాటినా ఇంకా నత్తనడకన సాగడం పాలకుల చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం మాత్రమే కాకుండా, దీనికి జాతీయ హోదా సాధించేలా కేంద్రంపై ఒత్తిడి తేవలసిన అవసరం ఎంతైనా ఉంది.
అలాగే భీమా ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్‌కు జూరాల నుంచే నీటిని తీసుకునేలా చర్యలు చేపట్టాలి. నికర జలాల కేటాయింపులు స్పష్టంగా ఉన్న ఆర్‌డిఎస్, జూరాల, భీమా-1, భీమా-2, కోయిల్ సాగర్ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా మిగిలిన పనులను తక్షణమే ముగించాలి. జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు చంద్రసాగర్ -అమ్రాబాద్ ఎత్తిపోతల పథకాలు, జూరాల- గట్టు ఎత్తిపోతల, వెల్టూరు- గొందిమల్ల బ్యారేజీ పనులను సత్వరం పూర్తి చేయాలి. బల్మూర్ మండల రైతాంగ ప్రయోజనాలను కాపాడటం కోసం రామగిరి రిజర్వాయర్ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలి. కృష్ణ, భీమా నదుల నీటి ఉమ్మడి వినియోగం కోసం కర్ణాటక ప్రభుత్వం తో చేపడుతున్న చర్చలు కొనసాగించాలి, మన వాటాను కాపాడుకునేందుకు సంప్రదింపులు జరుపుతూ ఉండాలి.
కృష్ణ- భీమా నదుల సంగమ స్థానంలో ఒక బ్యారేజీని, కోల్పూరు సమీపంలో మరో బ్యారేజీని, భీమా నదిపై దౌల్తాబాద్ కాగ్నా నది నీటిని సద్వినియోగం చేసుకునేలా ఇంకో బ్యారేజీని నిర్మించడం ద్వారా తెలంగాణ నీటి హక్కులను కాపాడాలి. అంతేకాకుండా తుంగభద్ర ఎడమ కాలువను తెలంగాణలోకి మరింత పొడిగించి జోగులాంబ గద్వాల జిల్లాకు నీటి భద్రత కల్పించాలి. దుందుభి నదిపై ఎగువ భాగం నుంచి వరుసగా బ్యారేజీలు నిర్మించడం ద్వారా లిఫ్ట్ నీటి వృథాను అరికట్టి, చుట్టుపక్కల భూములకు సమర్థవంతంగా సాగునీరు అందించవచ్చు. ఇక ప్రాజెక్టుల నిర్మాణంలో తమ సమస్తాన్ని త్యాగం చేసిన భూ నిర్వాసితులపట్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం, ప్రస్తుతం ఉన్న భూమి మార్కెట్ ధరలకు అనుగుణంగా వారికి న్యాయమైన పరిహారాన్ని చెల్లించాలి. వీటన్నింటికీ మించి కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు రావలసిన చట్టబద్ధమైన వాటాను సాధించుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా పోరాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.
ఆంధ్రప్రదేశ్ సాగిస్తున్న అక్రమ జలదోపిడీని ఏమాత్రం ఉపేక్షించకుండా, కఠినంగా వ్యవహరించాలి. అదే సమయంలో అంతర్రాష్ట్ర నదుల అనుసంధానంలో భాగంగా ముందుకు తెస్తున్న గోదావరి -కావేరి అనుసంధాన ప్రతిపాదనలను నిరసించాలి. తెలంగాణ నీటి హక్కులకు విఘాతం కలిగించే ఏ ప్రాజెక్టైనా, అది పొరుగు రాష్ట్రానిదైనా లేదా కేంద్రానిదైనా గళమెత్తక తప్పదు. పన్నెండేళ్ల స్వరాష్ట్ర పాలనలోనూ పాలమూరు ప్రజలు ఇంకా వలసల బాట పడుతుండటం, ప్రాజెక్టుల దాహార్తి తీరకపోవడం పాలకుల ప్రాధాన్యతలలోని లోపాలను ఎత్తిచూపుతోంది. నదుల పక్కనే ఉన్నా చుక్క నీటికి అల్లాడే పరిస్థితి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పోవాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం ప్రకటనల స్థాయి నుంచి కార్యాచరణ వైపు అడుగులు వేయాలి. ప్రాజెక్టులను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తిచేసి, ప్రతి ఎకరానికీ సాగునీరు అందించినప్పుడే పాలమూరు రైతాంగానికి స్వరాష్ట్ర ప్రయోజనాలు సిద్ధించినట్లవుతుంది.
- జె నారాయణ యాదవ్
949419270











