
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం విరాళాల చోరీపై పార్లమెంటులో చర్చ కు పట్టుబడుతున్న విపక్షాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారంనాడు పార్లమెంటు ప్రాంగణం లో ‘ఇండియా’ కూటమి ఎంపీలు వినూత్న నిరసనకు దిగారు. రామమందిర విరాళాల చోరీని ఎండగట్టేందుకు ‘చందా చోరీ’ స్కిట్ ప్రదర్శించారు. ఎంపీ పప్పు యాదవ్ పూజారి వేషంలో కాషాయ వస్త్రాలు ధరించి కూర్చున్నారు. ఆయన ముందు ఓ టేబుల్ వేసి దానిపై హుండీ పెట్టారు. దానికి అటు, ఇటు మరో రెండు హుండీలు ఏర్పాటు చేశారు. భక్తుల తరహాలో రాహుల్ గాంధీ, తదితరులు పప్పుయాదవ్ వద్దకు వచ్చి హుండీలో నగదు వేశారు. ఆ విరాళాలను తస్కరిస్తున్నట్టు పప్పుయాదవ్ నటిస్తూ ఆ స్కిట్‌ను రక్తికట్టించే ప్రయత్నం చేశారు.
ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పార్లమెంట్ హౌస్ ప్రాంగణంలోని మకర్ ద్వార్ వద్దకు చేరుకున్న విపక్ష ఎంపీలు జంట నిరసనలు చేపట్టారు. విద్యార్థులపై పోలీసుల దమనకాండను వ్యతిరేకిస్తూ హోం మంత్రి అమిత్‌షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయోధ్య రామాలయంలో విరాళాల చోరీపైనా బ్యానర్ పట్టుకుని నినాదాలు హోరెత్తించారు. ఈ నిరసనల్లో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా, స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు ధర్మేంద్ర యాదవ్, అవధేశ్ ప్రసాద్, ఆనంద్ బదౌరియా, జేఎంపీ ఎంపీ మహువా మాజీ తదిరులు పాల్గొన్నారు.
ఎంపీ దుస్తులపై ఓం బిర్లా వార్నింగ్
కాగా, శుక్రవారంనాడు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే కాషాయ దుస్తులతో సభకు వచ్చిన ఎంపీ పప్పు యాదవ్ తీరుపై స్పీకర్ ఓంబిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. నేరుగా ఎంపీ పేరును ప్రస్తావించకుండానే ఎంపీలు ఇలాంటి చర్యలకు పాల్పడటం వల్ల పార్లమెంటు గౌరవం దిగజారుతుందని హెచ్చరించారు.











