
న్యూఢిల్లీ: యువత ఛలో పార్లమెంటు నిరసనపై పోలీసు చర్యను పలువురు సినీ ప్రముఖులు ఖండించారు. విద్యార్థులకు మద్దతు తెలిపారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులు పార్లమెంటు కాంప్లెక్స్ వైపు సోమవారం దూసుకెళ్లడంతో పోలీసులు బాష్పవాయువు, లాఠీలతో విరుచుకుపడ్డారు. పోలీసుల దమనకాండలో పలువురు విద్యార్థులు గాయపడ్డారని కాక్రోచ్ జనతా పార్టీ ఆరోపించింది. షబానా అజ్మీ, ప్రకాశ్ రాజ్ వంటి పలువురు సినీ సెలబ్రెటీలు సైతం విద్యార్థులకు మద్దతు తెలిపారు.
విద్యార్థులపై పోలీసులు ఈ విధంగా వ్యవహరించి ఉండాల్సింది కాదని నటుడు, గాయకుడు దిల్జీజ్ దోసాంజ్ అమెరికా నుంచి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించారు. విద్యార్థుల డిమాండ్లను ఓపిగ్గా వినాలని కోరారు. తనపై కూడా పలువురు జాతివ్యతిరేకిగా ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జిని నటుడు, కమెడియన్ వీర్‌దాస్ ఖండించారు. విద్యార్థులకు మద్దతివ్వకుండా వారి సమస్యలపై మౌనం వహించే తోటి కళాకారుల తీరును కపటత్వంగా అభివర్ణించారు.
దేశంలో లైవ్ ఎంటర్‌టైన్మెంట్, కాన్సర్ట్ ఇండస్ట్రీ దాదాపు యువత, విద్యార్థుల ఆదరణపైనే నడుస్తోందన్నారు. యువత కష్టాల్లో ఉన్నప్పుడు వారి కోసం గొంతెత్తని కళాకారులు, టిక్కెట్లు అమ్ముకోవడానికి వారి దగ్గరకే వెళ్లడం సిగ్గుచేటని అన్నారు. విద్యార్థులు చూపించిన ధైర్యాన్ని సోహా అలీ ఖాన్ ప్రశంసించారు. భవిష్యత్తు యువతదేనని, ప్రశ్నించడం, ధైర్యంగా మాట్లాడటం, శాంతియుత నిరసన తెలిపే స్వేచ్ఛ వారికి ఉండాలని అన్నారు. విద్యార్థుల గోడు వినని ప్రగతికి అర్థం లేదని అదితి రావు హైదరి, సిద్ధార్ధ్, పూజా భట్ అభిప్రాయపడ్డారు.











