
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సహా జాతీయ స్థాయిలో ఇండియా కూటమి పార్టీలన్నీ తమ విభేదాలను పక్కనపెట్టి బీజేపీకి వ్యతిరేకంగా తమతో కలిసి పోరాడేందుకు ఏకం కావాలని టీఎంసీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. అమరవీరుల వార్షికోత్సవం సందర్భంగా మంగళవారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. సొంత పార్టీలో తిరుగుబాటు సృష్టించిన ద్రోహులను మాత్రం మళ్లీ పార్టీలోకి చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు.
బీజేపీకి మద్దతుగా ఉండాలంటే ఆ పార్టీలో చేరి పోటీ చేయాలని, ఎంత మంది వెళ్లిపోయినా తనకు సంతోషమేనని అన్నారు. యువనాయకులతో ఆ స్థానాలను భర్తీ చేసుకుంటామని చెప్పారు. టీఎంసీని బలహీనపరచేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి సువేందు అధికారి దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
పార్టీలో గత దశాబ్దకాలంగా ఆయన చేసిన పనులను బహిర్గతం చేస్తానని, ఆయన ముసుగు తొలగిస్తానని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ఓటమి చవిచూస్తే బిహార్‌లోనూ పునాదులు కదులుతాయని అన్నారు. టీఎంసీకి తానే వ్యవస్థాపక అధ్యక్షురాలిని అయినందున దానిని చేజిక్కుంచుకోవడం తిరుగుబాటు నేతలకు కుదరదని స్పష్టంచేశారు. తర్వలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు జరుపుతానని చెప్పారు.











