వరంగల్: బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కన్నుమూశారు. గుండె పోటు రావడంతో యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఐదు రోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గత అర్ధరాత్రి 12:51కి మృతి చెందినట్టు వైద్యుల వెల్లడించారు. స్వస్థలం వరంగల్‌ జిల్లా నల్లబెల్లిలో 1974 ఆగస్టు 6న పెద్ది సదర్శన్‌రెడ్డి జన్మించారు. 2001లో పెద్ది సుదర్శన్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరారు.  2001లో నల్లబెల్లి జెడ్పీటీసీ, 2016-2018 సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, 2018లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా సేవలందించారు.

పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సిఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆప్త మిత్రుడిని కోల్పోయానని కెసిఆర్ పేర్కొన్నారు. మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు పెద్ది అని ప్రశంసించారు. పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, పెద్ది మరణం పార్టీకి తీరని లోటు అని కెసిఆర్ తెలియజేశారు. నర్సంపేట బిఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. టిఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్నారని గుర్తు చేశారు. 


హైదరాబాద్‌ నుంచి సుదర్శన్‌రెడ్డి భౌతికకాయం శుక్రవారం తరలిస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హనుమకొండలో అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించడంతో పాటు ప్రజల సందర్శన కోసం భౌతికకాయాన్ని నర్సంపేటకు తరలిస్తామని, నర్సంపేట నుంచి స్వగ్రామం నల్లబెల్లికి తరలించిన అనంతరం శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు అంత్యక్రియలు ఉంటాయని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమకారుడికి తుది వీడ్కోలు అని ఎర్రబెల్లి తెలిపారు.