మన తెలంగాణ/నర్సంపేట: తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (52) గురువారం అర్ధరాత్రి మృతిచెందారు. ఈ నెల 26న హన్మకొండలోని తన నివాసంలో ఉండగా గుండెపోటుకు గురికాగా కుటుంబసభ్యులు హుటాహుటిన సమీపంలోని రోహిణి ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేశారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ మమతారెడ్డి తొమ్మిది సార్లు సీపీఆర్ చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రి తరలించారు. వైద్య చికిత్స త్వరగా అం దేందుకు గ్రీన్‌ఛానల్ ద్వారా హ న్మకొండ నుంచి 1.50 గంటల్లో సికింద్రాబాద్‌కు చేరుకోగా దీంతో వైద్యులు చికిత్స అందించారు. కాగా, పెద్ది సుదర్శన్‌రెడ్డికి గుండెపోటుతో పాటు ఊపిరి తిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ రావడం కారణంగా మెదడుకు రక్తం సరఫరా

కాక బ్రెయిన్ డెత్ అయినట్లుగా వైద్యులు నిర్దారించి అందుకు అవసరమైన చికిత్స చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. చికిత్స పొందుతుండగానే గురువారం అర్ధరాత్రి 12.50 గంటలకు పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిచెందినట్లుగా ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు కుటుంబసభ్యులు పెద్ది మృతదేహాన్ని హన్మకొండ మీదుగా నర్సంపేట నుంచి అంతిమ యాత్రగా ఆయన స్వగ్రామమైన నల్లబెల్లికి తీసుకొచ్చారు. లెంకాలపల్లి రోడ్డులోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం రాత్రి ప్రభుత్వం అధికార అలాంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించింది. అంతకుముందు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులిద్దరి సమక్షంలో పార్టీ నాయకులు పెద్ది భౌతికకాయంపై గులాబీ జెండా కప్పి నివాళులర్పించారు. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతోపాటు, రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల నాయకులు తరలివచ్చారు.

ఉద్యమకారుడికి దక్కిన అరుదైన గౌరవం

పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ అధికారుల లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పోలీసులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపిన అనంతరం పెద్ది సుదర్శన్‌రెడ్డి కుమారుడు నిదర్శన్‌రెడ్డి చితికి నిప్పంటించారు.