
రిటైరయ్యే ఉద్యోగ, ఉపాధ్యాయులకు త్వరితగతిన న్యాయం చేయాల్సిన కనీస ధర్మం, నైతిక బాధ్యత అధికారులపైనే ఉంది. పెన్షనరీ బెనిఫిట్స్ సకాలంలో రిటైర్డ్ ఉద్యోగికి అందాలంటే పెన్షన్ మంజూరు అధికారులు నాన్చుడు ధోరణికి వెంటనే స్వస్తి పలకాలి. రిటైరయ్యే రోజే పెన్షన్ మంజూరు పత్రాలు ఉద్యోగి చేతికి అందాలని ప్రభుత్వం జారీ చేసిన స్పష్టమైన ఉత్తర్వులను అమలు చేయాలి. ఉద్యోగి రిటైర్ అవడానికి ఆరు నెలల ముందే పెన్షన్ పేపర్లను ప్రిపేర్ చేసి ఎజి ఆఫీస్‌కు పంపించవల్సిన పూర్తి బాధ్యత మంజూరు అధికారులదే. ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.
దశాబ్దాలపాటు ప్రభుత్వ సేవలోనే గడిపి, విశ్రాంతి తీసుకునే వయసులో వచ్చే పెన్షన్ మంజూరు కోసం రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయులు వారాలు, నెలల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి రావడం అత్యంత విచారకరం! ముప్పై నలభై ఏళ్లపాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ భుజాలపై మోసి, వ్యవస్థల పురోగతికి రక్తాన్ని చెమటగా మార్చిన విశ్రాంత ఉద్యోగులకు.. గౌరవంగా, సకాలంలో దక్కాల్సిన పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి రావడం వ్యవస్థకే అవమానకరం! కలం చేత పట్టి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన గురువులు, ఫైళ్ల మోతతో ప్రభుత్వ పాలనను నడిపించిన ఉద్యోగులు.. రిటైర్ అయ్యాక తమ హక్కుల కోసం, చేతులు కట్టుకుని అధికారుల ముందు యాచకులుగా నిలబడాలా? జీవిత చరమాంకంలో ప్రశాంతంగా గడపాల్సిన వయసులో, ప్రభుత్వ నిబంధనలపై అవగాహన లేని కొందరు జిల్లా స్థాయి అధికారుల నిర్లక్ష్యపు ఫైళ్ల కింద వారి ఆత్మగౌరవం నలిగిపోతుండడం అత్యంత దారుణమైన విషయం.
తెలంగాణ రివైజ్డ్ పెన్షన్ రూల్స్- 1980లో క్వాలిఫైయింగ్ సర్వీస్ లెక్కించడానికి నిర్దేశించిన రూల్- 21 పై కనీస అవగాహన లేని కొందరు పెన్షన్ మంజూరు అధికారుల వైఖరి వల్ల రిటైర్ అవుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నప్పటికీ అధికారుల నాన్చుడు వైఖరితో సకాలంలో పెన్షన్ అందక ఎందరో రిటైర్డ్ సిబ్బంది మానసిక క్షోభకు గురవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఉద్యోగ కాలంలో లీవ్ శాలరీ పొందిన సెలవు దినాలన్నీ పెన్షన్‌కు క్వాలిఫైయింగ్ సర్వీస్ గానే పరిగణించబడతాయి. మెడికల్ గ్రౌండ్స్‌పై తీసుకున్న జీతనష్టపు అసాధారణ సెలవు పీరియడ్ మొత్తాన్ని కూడా పెన్షన్ క్వాలిఫైయింగ్ సర్వీస్‌గా పరిగణించాలని తెలంగాణ రివైజ్డ్ పెన్షన్ రూల్ -21(1) నిర్దేశిస్తోంది. వైద్య కారణాలతో తీసుకున్న ఎక్స్‌ట్రార్డినరీ లీవ్ (ఇఒఎల్) కాకుండా, ఇతర కారణాలతో తీసుకున్న అసాధారణ జీత నష్టం సెలవు (ఇఒఎల్) సైతం గరిష్టంగా 36 నెలల వరకు పెన్షన్ అర్హత సర్వీస్‌గా లెక్కించాలని రూల్- 21(2) స్పష్టం చేస్తోంది.
ఇంత చిన్న విషయం కూడా తెలియని వారు జిల్లా స్థాయి అధికారులుగా ఉండడం ఉద్యోగ, ఉపాధ్యాయుల దురదృష్టకరం. అలాగే పౌర అల్లర్ల కారణంగా విధుల్లో చేరలేకపోయినా లేదా హయ్యర్ సైంటిఫిక్, టెక్నికల్ విద్య కోసం వెళ్లినప్పుడు నియామక అధికారి అనుమతితో ఆ కాలాన్ని కూడా పెన్షన్‌కు క్వాలిఫైయింగ్ సర్వీస్‌గా లెక్కించవచ్చు. జీవో 214 ప్రకారం.. ముందస్తు అనుమతితో విదేశాల్లో ఉద్యోగం చేయడానికి వెళ్లే వారికి గరిష్టంగా ఐదు సంవత్సరాల వరకు ఇఒఎల్ మంజూరు చేస్తారు. ఈ ఐదేళ్ల ఇఒఎల్ కాలాన్ని సర్వీస్ బ్రేక్‌గా పరిగణించకూడదు. ఈ సెలవును ఒకేసారి లేదా విడతల వారీగా వాడుకోవచ్చు. అయితే, ఈ సెలవును విదేశాల్లో ఉద్యోగం చేయడానికే ఉపయోగించాలి తప్ప, అక్కడ ఉద్యోగం వెతుక్కోవడానికి ఉపయోగించకూడదు. పెన్షన్ కాంట్రిబ్యూషన్ చెల్లిస్తే ఈ ఐదేళ్ల పీరియడ్‌ని సైతం నిబంధనల ప్రకారం పెన్షన్ కోసం క్వాలిఫైయింగ్ సర్వీస్‌గానే తీసుకోవాలి.
ఇంతటి స్పష్టమైన నిబంధనలు చట్టంలో కళ్లెదుటే కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కొందరు జిల్లా స్థాయి అధికారులు మాత్రం గుడ్డిగా వ్యవహరిస్తూ పెన్షన్ ఫైళ్లను తిరస్కరించడం లేదా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టి కాలయాపన చేయడం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. అధికార దర్పంతో ఫైళ్లను మూలనపడేసే అధికారులు.. కాల చక్రం తిరుగుతుందని, రేపు తాము కూడా పెన్షన్ కోసం ఇలాగే క్యూలైన్లలో నిలబడాల్సిన రోజొకటి వస్తుందనే కఠిన వాస్తవాన్ని ఎలా విస్మరిస్తారు? ఇప్పటికైనా పెన్షన్ మంజూరు అధికారులు ప్రభుత్వ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలి. రిటైరయ్యే ఉద్యోగ, ఉపాధ్యాయులకు త్వరితగతిన న్యాయం చేయాల్సిన కనీస ధర్మం, నైతిక బాధ్యత అధికారులపైనే ఉంది.
పెన్షనరీ బెనిఫిట్స్ సకాలంలో రిటైర్డ్ ఉద్యోగికి అందాలంటే పెన్షన్ మంజూరు అధికారులు నాన్చుడు ధోరణికి వెంటనే స్వస్తి పలకాలి. రిటైరయ్యే రోజే పెన్షన్ మంజూరు పత్రాలు ఉద్యోగి చేతికి అందాలని ప్రభుత్వం జారీ చేసిన స్పష్టమైన ఉత్తర్వులను అమలు చేయాలి. ఉద్యోగి రిటైర్ అవడానికి ఆరు నెలల ముందే పెన్షన్ పేపర్లను ప్రిపేర్ చేసి ఎజి ఆఫీస్‌కు పంపించవల్సిన పూర్తి బాధ్యత మంజూరు అధికారులదే. ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం ఈ విషయంలో నిక్కచ్చిగా ఉండి కఠినంగా వ్యవహరిస్తేనే క్షేత్రస్థాయిలో చలనం వస్తుంది, రిటైర్ అయ్యే ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయం జరుగుతుంది. సకాలంలో పెన్షన్ మంజూరు అవుతుంది. లేని పక్షంలో, పెన్షన్ మంజూరు ప్రక్రియ అధికారుల ఇష్టారాజ్యంగా, అవినీతికి అడ్డాగా మారే ప్రమాదం ఉంది.
- మానేటి ప్రతాపరెడ్డి
98484 81028










