ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే పార్టీ, ఒకే నాయకుడు అన్న కల సాకారం చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ రాజకీయ శక్తులను బలహీనపరచడానికి, అంతం చేయడానికి ప్రయత్నిస్తుంటే శనివారంనాడు తెలంగాణలో ఒక కొత్త ప్రాంతీయ రాజకీయ శక్తి అవతరించింది. అది కూడా ఒక మహిళ నాయకత్వంలో అవతరించడం విశేషం. పశ్చిమ బెంగాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన మహిళా నాయకురాలు మమతా బెనర్జీని రాజకీయంగా మట్టి కరిపించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే బెంగాల్ ఎన్నికలవేళ మహిళా బిల్లు ప్రహసనం పార్లమెంట్ ముందుకు తెచ్చింది కానీ బిజెపి రాజకీయాల్లో మహిళలకు నాయకత్వం ఇవ్వడాన్ని ఎప్పుడూ విశ్వసించదు. ఆ విధంగా కూడా ప్రస్తుతం తెలంగాణలో శనివారంనాడు ఏర్పాటైన కొత్త రాజకీయ పార్టీ ప్రాధాన్యతను సంతరించుకున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలి విడత ఉద్యమాన్ని ముందుకు ఉరికించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన (టిఆర్‌ఎస్)ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

తెలంగాణలో 1969లో తొలి ఉద్యమంకోసం ఏర్పాటైన తెలంగాణ ప్రజా సమితినుండి శనివారంనాడు కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేనను ఏర్పాటు చేసేదాకా ప్రాంతీయ అసమానతల అంశం మీదనే పలువురు నాయకులు రాజకీయ పార్టీలు ఏర్పాటు చేశారు. ఆలె నరేంద్ర, పట్లోల్ల ఇంద్రారెడ్డి కాలం చెయ్యగా, విజయశాంతి, తూడి దేవేందర్ గౌడ్, నాగం జనార్దనరెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, వైయస్ షర్మిల, ప్రొఫెసర్ కోదండరాం వీళ్లంతా తెలంగాణలో రాజకీయ ప్రయోగాలు చేసినవాళ్లే. ఇందులో కోదండరాం తెలంగాణ జన సమితి ఒక్కటే ఇంకా పేరుకైనా మిగిలి ఉన్నట్టుంది. మిగతా అందరూ వేరువేరు పార్టీలకు వలసపోవడమే చూశాం. దాదాపు పది మాసాల క్రితం భారత రాష్ట్ర సమితి నుండి సస్పెండ్ అయిన దగ్గర్నుండి కవిత మరో ప్రాంతీయ రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నారన్న ప్రచారం పెద్దయెత్తున జరిగింది.

భౌగోళికంగా, రాజకీయపరంగా తెలంగాణ రాష్ట్రం అయితే సాధించుకున్నాం కానీ, తెలంగాణ అస్తిత్వానికి తగినంత గౌరవం ఇంకా పొందనేలేదని ఈ ప్రాంతంలోని సబ్బండవర్గాలు ఇంకా బలంగా భావిస్తున్న సమయంలో సరిగ్గా వారం క్రితం తెలంగాణ అస్తిత్వ వేదిక ఒకటి ఆవిష్కృతమైంది. తెలంగాణ ప్రకాష్‌గా ప్రసిద్ధుడైన వి. ప్రకాష్, శ్రీధరరావు దేశ్ పాండే, పిట్టల రవీందర్ తదితర తెలంగాణ మేధావులు ఈ తెలంగాణ అస్తిత్వవేదికను ప్రారంభించిన వారం రోజుల్లోనే కల్వకుంట్ల కవిత కొత్త ప్రాంతీయ రాజకీయ శక్తిగా టిఆర్‌ఎస్‌ను ప్రారంభించడం యాదృచ్ఛికమే అయినా తమ అస్తిత్వం, ఆత్మగౌరవం ఆశించిన స్థాయిలో నిలబడలేదని, ఇన్నేళ్లయినా తెలంగాణ ప్రజలు అత్యధికులు భావిస్తున్నారని అర్థం అవుతున్నది. ఒక వారం తేడాతో ఆరంభం అయిన ఈ రెండు వ్యవస్థలు ఒకటి రాజకీయాన్ని ముందుకు తీసుకుపోతే, మరొకటి తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకుపోయే సంకల్పంతో ఏర్పడ్డాయి. ఈ రెండింటి పని తీరు, అందువల్ల వచ్చే ఫలితాలను భవిష్యత్తు నిర్ణయిస్తుంది.

ఇక శనివారంనాడు మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో కవిత పార్టీ ఆవిర్భావ ప్రకటనతోనే తన తండ్రి కెసిఆర్ అధ్యక్షుడిగా ఉన్న భారత రాష్ట్ర సమితికి తొలి ‘చెక్’ పెట్టారు. కొద్దిరోజులుగా ఆమె ఏర్పాటు చేయబోతున్న పార్టీ పేరును అందరూ రకరకాలుగా ఊహించారు. ఒక దశలో తన పార్టీ పేరు టిఆర్‌ఎస్ గా ఉండాలని ఆమె ప్రయత్నిస్తున్నారని ప్రచారం కూడా జరిగింది. అందుకేనేమో, బిఆర్‌ఎస్‌గా పేరు మార్పు కూడా పార్టీ ఓడిపోవడానికి ఒక కారణం అని కెటిఆర్ ఈ మధ్య వ్యాఖ్యానించారు. మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చేందుకు ఆలోచన జరుగుతున్నదని చూచాయగా చెప్పారు.

పార్టీ ఆవిర్భావ సభలో కవిత కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చడాన్ని విమర్శించిన విషయం తెలిసిందే. పార్టీ పేరు మార్చినంత మాత్రాన జాతీయ రాజకీయాల్లో రాణించడం అలా ఉంచి ప్రభావశీలమైన పాత్ర నిర్వహించడం కూడా సాధ్యం కాదన్న విషయం ఇప్పటికే భారత రాష్ట్ర సమితి నాయకత్వానికి అర్థం అయి ఉంటుంది. ఇప్పుడు ఇక తన పార్టీని టిఆర్‌ఎస్‌గా కవిత ప్రకటించడంతో భారత రాష్ట్ర సమితి అయోమయంలో పడ్డట్టే. తన తండ్రి అధ్యక్షుడిగా ఉన్న పార్టీ మీద కవిత సాధించిన తొలి పైచేయి ఇది. ఎందుకంటే టిఆర్‌ఎస్ అనే మూడు అక్షరాలు చాలా శక్తిమంతమైనవి. 2001 నుండి 2021 వరకు 20 సంవత్సరాలపాటు తెలంగాణ సబ్బండవర్గాలను సమ్మోహితులను చేసిన అక్షరాలవి. 2001లో జలదృశ్యంలో ఏప్రిల్ 27న టిఆర్‌ఎస్ రాజకీయ పార్టీగా అవతరిస్తే 2021లో అది భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. పేరు మార్పుతోనే నిజానికి ఆ పార్టీకి కష్టకాలం ప్రారంభం అయిందని చెప్పాలి. ఏట్లో రాయి ఏరడానికి వెళ్లే ముందు మన కూట్లో రాయి ఏరుకోవడం రావాలి. అది ముఖ్యం అన్న విషయం విస్మరించినందువల్లనే భారత రాష్ట్ర సమితి ఈ స్థితిలో ఉందన్న విమర్శ తరచూ వినిపిస్తుంది.

కవిత రాజకీయ పార్టీ ప్రారంభిస్తారు అన్నప్పటినుండి రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. కుటుంబ తగాదాల కారణంగా ఆమెను బయటికి పంపించారని, ఆస్తుల తగాదావల్ల ఆమె కుటుంబంలోని ఇతర రాజకీయ పెద్దలతో విభేదించారని, అసలు రాజకీయ వ్యూహంలో భాగంగా కెసిఆరే ఆమెను బయటికి పంపారనీ రకరకాల ప్రచారాలు జరిగాయి. ప్రచారాలు ఎలా ఉన్నా నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సేన (టిఆర్‌ఎస్) ప్రభావం రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల మీద కచ్చితంగా పడనుందని అనిపిస్తున్నది. పార్టీ ఆవిర్భావ సభలో కవిత చాలా కొద్దిసేపు చేసిన తన ప్రసంగంలో పాంచజన్యం పూరించారు. తాను అధికారంలోకి వస్తే (ఖచ్చితంగా వస్తామన్న విశ్వాసం ఆమెది) అమలు చెయ్యబోయే అయిదు అంశాలు.. పేద, మధ్యతరగతి వాళ్ళందరికీ నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతులకు ఉచిత విద్యుత్తు, మొదటి సంవత్సరంలోనే కొన్ని లక్షల ఉద్యోగాలు, బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీలకు సామాజిక న్యాయం అందజేస్తామని ప్రకటించారు.

రాజకీయాల్లో కెసిఆర్ బాపును నిలువరించడానికి తాను అమ్మగా పరిణతి చెందదల్చుకున్నానని కూడా చెప్పారు. దానికి ఆమె చెప్పిన ఒక మాట జనాన్ని తప్పనిసరిగా ఆకట్టుకుంటుంది. ఏ కుటుంబంలోనైనా పిల్లల ఆకలి దప్పులను గురించి ఎక్కువగా ఆలోచించేది తల్లి. అమ్మ కడుపు చూస్తది కానీ జేబు చూడదు అని. రాజకీయాల్లో ఎన్‌టి రామారావు అన్నగా ప్రసిద్ధుడైతే, జయలలిత అమ్మగా ప్రసిద్ధురాలు. అలాగే కెసిఆర్‌ను చాలామంది బాపు అంటుంటారు. ఇప్పుడు కవిత అక్క నుండి అమ్మగా మారాలనుకుంటున్నానని ప్రకటించడం భావోద్వేగాపరంగా జనాన్ని ఆకట్టుకుంటుంది.

ఇక రాజకీయ విమర్శల విషయానికొస్తే కవిత కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీదకంటే భారత రాష్ట్ర సమితి మీదనే ఎక్కువ విమర్శలు గుప్పించారు. ఇందుకు కారణం తెలంగాణలో భారత రాష్ట్ర సమితి ఎక్కువ కాలం అధికారంలో ఉండటం కావచ్చు. బిజెపి అసలు తెలంగాణలో అధికారంలో లేకపోవడం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి స్వల్పకాలం కావడం కూడా కావచ్చు. బిజెపి ఎంపిలను దద్దమ్మలని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కర్కోటకుడని సరిపోల్చారు. భారత రాష్ట్ర సమితిని మాత్రం తీవ్రంగా విమర్శించారు. కాగా ఆ విమర్శ అంతా తన తండ్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ మీదనే కేంద్రీకరించడం విశేషం. బిఆర్‌ఎస్ నుండి సస్పెండ్ అయిన గత పది నెలల కాలంలో ఆమె విమర్శలు ఎక్కువగా కెటి రామారావు, తన్నీరు హరీశ్ రావు మీదనే ఉండేవి. తన తండ్రి చుట్టూ దయ్యాలు చేరాయని ఆమె విమర్శించేవారు. కారణాలు ఏవైనా 2023లో పార్టీ ఓడిపోయిన దగ్గర నుండి కెసిఆర్ ప్రజాక్షేత్రంలోకి రావడం అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే ఆయన బయట కనిపించారు. అదీ మొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరుతున్న సందర్భంగా జగిత్యాలలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఆరోగ్యపరంగా కొంత మునుపటి కెసిఆర్ లా కనిపించినా ఆయన ప్రసంగంలో ఆ ధాటి లేదు. ‘ఎక్కడ ఏం జరిగినా ఉద్యమ కాలంలో వెంటనే వాలిపోయే కెసిఆర్ ఎక్కడ? సారు రారు. ఆయన మన మనిషి కాదు ఇప్పుడు మర మనిషి. కొందరి చేతిలో ‘కీలుబొమ్మ’ అని అర్థం వచ్చే విధంగా ఆమె కెసిఆర్ మీద వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన కుటుంబంలో భాగంగా ఉన్నందుకు జరిగిన తప్పులకు క్షమాపణ చెప్తున్నాను అని ఆమె బహిరంగంగా పార్టీ ఆవిర్భావ వేదిక మీద ప్రకటించుకోవడం అభినందించాల్సిన విషయమే.

తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆవిర్భావంనాడే దృఢంగా నమ్ముతున్న కవిత అది జరగాలంటే తన పూర్వాశ్రమ రాజకీయపక్షం పోకడలన్నిటినీ వదిలించుకోవాలి. అన్నిటికన్నా ముందు నాయకురాలు అయినా, నాయకుడు అయినా జనంలో ఉండాలి. పునాదులనుండి పార్టీ నిర్మాణం జరగాలి. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు రాజకీయంగా సుశిక్షితులైన కార్యకర్తలు, రెండవ శ్రేణి నాయకులు ఉండి పార్టీ నిర్మాణం బలంగా ఉంటే తప్ప ఆమె స్వప్నం సాకారం కాజాలదు. అదేమీ లేకపోయినా రెండుమార్లు భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండగా అధికారంలోకి వచ్చింది కదా అంటే రాష్ట్ర సాధన కోసం బలమైన ఉద్యమం నడిపారు అన్న ఇంగువ ఆ గుడ్డకు కట్టి ఉండింది కాబట్టి. అయితే కవితకు ఉన్న కొన్ని అనుకూల అంశాలు తెలంగాణ జాగృతి, సింగరేణి కార్మిక సంఘాల నాయకురాలిగా పనిచేసిన అనుభవం, ఐదేళ్లు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న అనుభవం. వీటన్నిటిలో ముఖ్యమయింది జాగృతి పేరిట ఏర్పరచుకున్న వ్యవస్థ. ఇప్పటికైతే రాజకీయంగా అందరికీ బాగా తెలిసిన ముఖాలు ఆమె చుట్టూ కనిపించలేదు. బహుశా అది కూడా ఒక అనుకూల అంశమేనేమో. ఏదేమైనా, నూతనంగా ఏర్పడిన టిఆర్‌ఎస్‌కు, ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఆల్ ది బెస్ట్.

 

దేవులపల్లి అమర్