ప్రవాసులు పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి

మీ కోసమే సత్వర అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తున్నాం

ప్రపంచ దేశాలతో పోటీపడేలా తెలంగాణ అభివృద్ధి జరుగుతోంది

ఎన్‌ఆర్‌ఐల సమస్యల పరిష్కారానికి చట్టబద్దమైన ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు యోచిస్తున్నాం

ఆన్‌లైన్‌లో ఓటు హక్కు నమోదు చేసుకోండి

ఆటా 19వ జాతీయ మహాసభలో ప్రవాసులతో ఉప ముఖ్యమంత్రి భట్టి పిలుపు

మన తెలంగాణ/హైదరాబాద్: అనేక కష్టనష్టాలకోర్చి ఖండాంతరాలు దాటి ఉన్నత శిఖరాలకు చేరుకున్న ప్రవాస భారతీయులు, తాము సాధించిన విజ్ఞానాన్ని, మేధస్సును సొంత రాష్ట్రం, పుట్టిన గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా జరిగిన 19వ ఆట (ఏటిఏ) జాతీయ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాకుండా, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో దీటుగా తెలంగాణ రాష్ట్రాన్ని పోటీపడే స్థాయికి తీసుకెళ్తున్నామని, ఈ క్రమంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాసులు ముందుకు రావాలని ఆయన కోరారు. మీకోసం సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేశాం. అన్ని అనుమతులు వెంటనే ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది.

పారిశ్రామికంగా, సామాజికంగా మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలో మేము వెన్నంటి ఉంటాం. మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించాలనే ఉద్దేశంతోనే సిఎం రేవంత్ రెడ్డి నన్ను ఇక్కడికి పంపించారు. అని డిప్యూటీ సిఎం ప్రవాసులకు భరోసా ఇచ్చారు. తెలంగాణను 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మలచాలనే స్పష్టమైన ప్రణాళికతో సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని భట్టి తెలిపారు. పెట్టుబడులకు, పరిశ్రమలకు అత్యంత అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం వేగంగా దూసుకెళ్తోందని వివరించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరానికి మణిహారంగా ఉన్న 56 కిలోమీటర్ల మూసీ నదిని లండన్ లోని థేమ్స్ నది తరహాలో సుందరీకరిస్తున్నామని, స్వచ్ఛమైన నీరు పారేలా ప్రక్షాళన చేసి నగర రూపురేఖలు మార్చబోతున్నామని వెల్లడించారు.

గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం నేడు తెలంగాణకు పెద్ద ఆస్తులుగా మారాయని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ ఔటర్ రింగ్ రోడ్డును దాటి మిగతా జిల్లాలను కలుపుతూ ట్రిపుల్ ఆర్ (రీజినల్ రింగ్ రోడ్) నిర్మిస్తున్నామని, వాటిని అనుసంధానం చేస్తూ కొత్తగా 36 రేడియల్ రోడ్లను ప్లాన్ చేశామని పేర్కొన్నారు. అంతేకాకుండా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు దీటుగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆ ప్రాంతాన్ని ఆనుకుని సరికొత్తగా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వివరించారు. రాష్ట్ర ప్రగతికి మానవ వనరుల అభివృద్ధే కీలకమని నమ్మిన ప్రభుత్వం, అందుకోసం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు భట్టి తెలిపారు.

సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు సైతం అమెరికా దాకా ఎదిగి ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకోవాలన్న ఉద్దేశంతోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 100 నియోజకవర్గాల్లో ఒక్కో పాఠశాలను 25 ఎకరాల సువిశాల క్యాంపస్‌లో, రూ. 200 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఈ బృహత్తర యజ్ఞంలో ప్రవాసులు భాగస్వాములు కావాలని, ఏ మూలాల నుంచి వచ్చారో ఆ మూలాలను మర్చిపోకుండా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నారైల సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన ప్రత్యేక వ్యవస్థ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు (ఎన్నారైలు), తెలంగాణలో ఉంటున్న వారి తల్లిదండ్రుల సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధత (లీగల్ స్టేటస్) కలిగిన ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ ఆలోచనలో ఉందన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రవాసులు, తమ సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక వేదిక కావాలని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంపై ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రపంచంలో ఎక్కడున్న తెలంగాణ వాసులైనా తమ ఇబ్బందులను లేదా రాష్ట్రంలో ఉంటున్న తమ తల్లిదండ్రుల సమస్యలను ఈ ప్రత్యేక వ్యవస్థ దృష్టికి తీసుకొస్తే, వాటిని సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ కొనసాగుతోందని ప్రవాసులకు గుర్తుచేశారు. తెలంగాణ పౌరులు ప్రపంచంలో ఏ నలుమూలల ఉన్నా, ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా తమ ఓటు హక్కును నమోదు చేసుకునే సదుపాయం అందుబాటులో ఉందన్నారు. ప్రవాసులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.