న్యూఢిల్లీ: నీట్ అవకతవకల వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. పేపర్ లీక్ ఘోర పా పమని అన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, తద్వారా యువత భవిష్యత్తుతో ఎవరు చెలగాటమాడకుండా చూస్తామని తెలిపారు. ఇలాంటి లీక్‌లను నివారించడం జాతీయ బాధ్యత అని పేర్కొన్నారు. ఇది పార్టీ రాజకీయాలకు సంబంధించిన అంశం కాదన్నారు. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశమైనందున అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కలిసి పనిచేయాలని కోరారు.

మంగళ్ మిలన్ పేరిట మంగళవారంనాడిక్కడ జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు ప్రధాని మోదీ మాట్లాడారు. ఆ వివరాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మీడియా సమావేశంలో తెలిపారు. నీట్ పేపర్ లీక్ అంశం వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 13 మందిని జైలుకు పంపామని చెప్పారు. ఇదే సమయంలో విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నీట్ పునఃపరీక్ష నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చామని, ఫలితాలను కూడా ఆలస్యం లేకుండా ప్రకటించనున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో పేపర్ లీక్‌‌లు జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారని తెలిపారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా దేశంలోని ప్రముఖ న్యాయవాదులను నియమించాలని కూడా ప్రధాని సూచించినట్టు చెప్పారు.

ఈ అంశంపై ఎంపీలంతా ప్రజల ముందుకు వెళ్లి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించి వారికి మరింత చేరువకావాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరుగనీయమని, దేశ భవిష్యత్తు, యువత సంక్షేమం కోసం కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఎంపీలందరిపైనా ఉందని ప్రధాని సూచించారు. పిల్లలను రెచ్చగొట్టవద్దని, తప్పుడు మార్గంలోకి వెళ్లడం సులభమే కానీ తిరిగి సరైన మార్గంలోకి రావడం కష్టమని, వారు సరైన మార్గంలో వెళ్లేలా చూసుకోవడం మన అందరి బాధ్యత అని ప్రధాని పేర్కొన్నారు. ఎన్డీయే సమావేశంలో దేశ ఆర్థిక పురోగతి, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, ప్రభుత్వ విజయాలపై ప్రధాని సమీక్షించినట్టు రిజిజు చెప్పారు. వాణిజ్య ఒప్పందాల్లో రైతుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలుగకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రధాని హామీ ఇచ్చారని తెలిపారు.