
అసోం, బెంగాల్, బీహార్‌లో విద్యార్థులు, నిరసనకారుల నిర్బంధంపై సీజేపీ ఆందోళన
కేంద్రం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలి
విద్యార్థులపై ప్రతీకార చర్యలకు పాల్పడరాదు
లీగల్ సాయంతో విద్యార్థుల విడుదలకు చర్యలు తీసుకుంటాం
లిఖిత పూర్వక హామీ మంగళవారం ఇస్తామని చెప్పిన కేంద్రం మాట నిలుపుకోవాలి
ప్రభుత్వంపై నమ్మకంతోనే దేశవ్యాప్త సమ్మెను సస్పెండ్ చేశాం
ఇచ్చిన మాటకు కట్టుబడకుంటే విశ్వాసరాహిత్యమే అవుతుంది
మాట తప్పితే తదుపరి కార్యాచరణ తప్పదన్న సీజేపీ
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నిరసనలకు దిగిన విద్యార్థులను అరెస్టు చేస్తున్నట్టు అసోం, పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల నుంచి వార్తలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సోమవారంనాడు ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్త ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులపై ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోమని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని కోరింది. సీజేపీ ప్రకటనను ఆ పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ సోమవారంనాడు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
సీజేపీ సారథ్యంలో విద్యార్థులు చేపట్టిన 36 రోజుల నిరసన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, విద్యార్థుల ప్రధాన డిమాండ్లు నెరవేరుస్తామని కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ హామీ ఇవ్వడంతో సుఖాంతమైంది. ఈ క్రమంలో సీజేపీ తాజా ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు, నిరసనకారులను టార్గెట్ చేసుకుని నిర్బంధాలు, అరెస్టులు జరుగుతున్నట్టు తమకు సమాచారం ఉందని, ముఖ్యంగా అసోం, పశ్చిమబెంగాల్, బిహార్‌ల నుంచి ఈ సమాచారం వస్తోందని సీజేపీ ఆ ప్రకటనలో పేర్కొంది.
బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో విద్యార్థులపై ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో కూడా ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోమని కేంద్రం హామీ ఇచ్చిన తర్వాతే తాము దేశవ్యాప్త నిరసనలను నిలుపుదల చేసినట్టు తెలిపింది. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి వస్తున్నసమాచారం తమకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని చెప్పింది. దేశవ్యాప్త నిరసనల్లో అరెస్టయిన విద్యార్థులను విడుదల చేస్తామని, ప్రతీకార చర్యలు తీసుకోమని కేంద్ర ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని, వారిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను కూడా ఉపసంహరించుకోవాలని కోరింది.
ఈ అంశంపై మంగళవారంనాడు లిఖిత పూర్వక హామీను అందజేస్తామని చర్చల్లో తమకు ఇచ్చిన హామీని కేంద్రం నిలుపుకోవాలని పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విశ్వసించి దేశవ్యాప్త ఆందోళనను తాము సస్పెండ్ చేసామని, వాటికి ప్రభుత్వం కట్టుబడకుంటే అది విశ్వాసరాహిత్యమే కాక, ప్రజావిశ్వాసానికి తూట్లు పొడిచినట్టు అవుతుందని తెలిపింది. మాట తప్పితే అది విద్యార్థులకు సమ్మతం కాదన్నారు. నిర్బంధంలోకి తీసుకున్న విద్యార్థులను తక్షణం విడుదల చేసి, ఎఫ్‌ఐఆర్‌లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో తదుపరి చర్చలు తీసుకుంటామని సీజేపీ హెచ్చరించింది.











