కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అలాగే రూ.1 లక్ష జరిమానా కూడా విధించింది. 2022లో పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఢిల్లీకి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
సమగ్ర దర్యాప్తుతో బాలికను ఢిల్లీలో గుర్తించి రక్షించిన పోలీసులు, నిందితుడు మహమ్మద్ అబ్దుల్ రహీంను అరెస్ట్ చేసి పోక్సో, ఎస్సీ ఎస్టీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం కోర్టు నిందితుడిపై అభియోగాలు రుజువయ్యాయని తేల్చింది. కేసును సమర్థంగా దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను జిల్లా ఎస్పీ అభినందించారు. చిన్నారులపై నేరాలకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదని ఎస్పీ హెచ్చరించారు.














