న్యూఢిల్లీ: విద్యార్థులపై పోలీసులు ప్రదర్శించిన అత్యాచార వైఖరి, పరీక్షల వ్యవహారంలో ప్రభుత్వ బాధ్యతారాహిత్యంపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ నిర్వహించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పలువురు విపక్ష ఎంపీలు మంగళవారం కోరారు. సభ ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీతో పాటు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్, శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్, ఆర్‌ఎస్‌పీ ఎంపీ ఎన్.కే. ప్రేమచంద్రన్ తదితరులు స్పీకర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి తమ విజ్ఞప్తిని వినిపించారు. అనంతరం రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, విద్యార్థులపై నిన్న జరిగిన పోలీసుల దాడి, పరీక్షల సంక్షోభంలో ప్రభుత్వ పూర్తి బాధ్యతారాహిత్యంపై పార్లమెంట్‌లో విసృ్తతంగా చర్చ జరగాలని కోరాం అని తెలిపారు.

తమ భవిష్యత్తుకు సంబంధించిన సముచిత ప్రశ్నలు అడిగినందుకే విద్యార్థులపై దాడులు జరిగాయని రాహుల్ ఆరోపించారు. దేశ యువత భవిష్యత్తుపై కూడా పార్లమెంట్‌లో చర్చ జరగకపోతే, ఆ సభ ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నించారు. విద్యార్థుల గొంతును అణచివేయడానికి ప్రతిపక్షం అవకాశం ఇవ్వదని, వారి సమస్యలు వీధుల్లోనే కాకుండా పార్లమెంట్‌లోనూ మారుమోగేలా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ విప్ మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై సోమవారం నిర్వహించిన నిరసన సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడిపై సభలో చర్చ జరపాలని స్పీకర్‌ను కోరినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభకు వచ్చి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని ఆయన వెల్లడించారు.

ఇదిలా ఉండగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో రోజు ప్రారంభానికి ముందు ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్లు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో సమావేశమై పార్లమెంట్ వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేశ్, కే.సి. వేణుగోపాల్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ధర్మేంద్ర యాదవ్, ఎన్‌సీపీ (ఎస్‌పీ) నేత సుప్రియా సూలే, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, జేఎంఎం నాయకురాలు మహువా మాజి, సీపీఎం నేతలు జాన్ బ్రిట్టాస్, పి. సంతోష్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు పలుమార్లు వాయిదా పడ్డాయి. అదే సమయంలో కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్ ముట్టడి యత్నంలో నిరసనకారులు బ్యారికేడ్లను దాటేందుకు ప్రయత్నించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశంతో పాటు రామాలయ విరాళాల దుర్వినియోగంపై కూడా చర్చ జరపాలని ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజీ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అత్యంత కీలక అంశమని పేర్కొన్నారు.