తంజావూరు: తమిళనాడులోని తంజావూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఒక పూరింట్లో చెలరేగిన మంటలను స్థానికులు ఆర్పడానికి ప్రయత్నిస్తుండగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పేలడంతో 15 ఏళ్ల బాలికతో సహా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం.. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరు తంజావూరు మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటన లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన రైతు మురుగయన్ నివాసంలో అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల సమయంలో జరిగింది. తిరువోనం సమీపంలోని చిన్న అమ్మన్‌కుడి వద్ద ఉన్న పూరింట్లో అందరూ నిద్రిస్తుండగా మంటలు అంటుకున్నాయి. ఇంటిని మంటలు చుట్టుముట్టడాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆ కుటుంబాన్ని అప్రమత్తం చేసి, వారు సురక్షితంగా బయటపడేలా సహాయపడ్డారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు స్థానికులు ప్రయత్నించారు. ఈ క్రమంలో వంటగదిలో ఉన్న ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది.

ఈ ఘటనలో మురుగయన్, అతని 15 ఏళ్ల కుమార్తె అభినయ తీవ్రంగా గాయపడ్డారు. మంటలను ఆర్పే ప్రయత్నించిన పలువురు స్థానికులు కూడా తీవ్ర గాయాలకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్లతో మంటలను అందులోకి తీసుకొచ్చారు. గాయపడిన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. బాధితులను కాశీనాథన్, రాజశేఖర్, పళనివేల్, వెంబయ్యన్, కలైయరసి, భువనేశ్వరన్, సెల్వరాజ్, కాళీయమ్మాల్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.